MCRHRD: సీఎం క్యాంపు కార్యాలయంపై క్లారిటీ ఇచ్చిన రేవంత్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ సీఎం క్యాంపు కార్యా లయంపై స్పష్టత వచ్చింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (MCRHRD)లోని ఖాళీ స్థలాన్ని ప్రభుత్వ అవసరాల కోసం వినియోగించుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాభవన్‌లో ఉన్న కార్యాలయాన్ని కూడా ఉపయోగించుకుంటామన్నారు. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీలో ఉన్న ఖాళీ స్థలంలో సీఎం క్యాంపు ఆఫీసు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
కొత్తగా ఎలాంటి భవనాలు నిర్మించబోమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. శాసనసభ భవనాలను సమర్థంగా వినియోగించుకుంటామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సాగుకు 12 నుంచి 14 గంటలకు మించి విద్యుత్ ఇవ్వలేదని చెప్పారు. శ్వేతపత్రం సహా అన్ని అంశాలపై అందరితో చర్చించి సమయం వచ్చినప్పుడు విడుదల చేస్తామన్నారు సీఎం రేవంత్.

రాయదుర్గం నుంచి ఎయిర్ పోర్టుకు మెట్రో ఉపయోగకరంగా ఉండదన్న సీఎం.. మరో రూట్‌లో మెట్రో ప్లాన్ చేస్తామని చెప్పారు. కాగా, ప్రజా భవన్ ను ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీఎం క్యాంపు కార్యాలయం మార్పు అంశం తెరపైకి వచ్చింది.
శుక్రవారం బీఏసీ సమావేశం ఉంటుందని.. అసెంబ్లీ సమావేశాల ఎజెండాపై నిర్ణయం తీసుకుంటామన్నారు. పాత అసెంబ్లీ భవనంలోనే కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయన్నారు. ఇప్పుడు ఉన్న అసెంబ్లీ భవనంలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పార్లమెంట్ తరహాలో అసెంబ్లీ ఉండబోతోందని సీఎం రేవంత్ తెలిపారు.
కాగా, ఇటీవల సీఎం రేవంత్ ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ భవనాలను పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ భవనాన్ని గత ఆదివారం ఎలక్ట్రిక్ వాహనంలో పరిశీలించారు. ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. కాగా, రేవంత్ రెడ్డి నివాసం జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి సమీపంలో ఉండటంతో క్యాంపు కార్యాలయంగా అక్కడికి దగ్గరలోనే (జూబ్లీహిల్స్ రోడ్ నెం. 25) ఉన్న హెచ్ఆర్డీ ప్రాంగణంలోకి మార్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
45 ఎకరాల విస్తీర్ణంతో ఉన్న ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ ప్రాంగణంలో 150 మంది కూర్చునే నాలుగు కాన్ఫరెన్స్ హాళ్లు, పరిపాలక మండలి సమావేశం కావడానికి వీలుగా బోర్డ్ రూమ్, 250 మంది కూర్చునే ఆడిటోరియం, అతిథులకు ఆతిథ్యం ఇవ్వడానికి మంజరీ, కృష్ణ, గోదావరి, తుంగభద్ర పేర్లతో విడివిడి బ్లాకులు ఉన్నాయి.












Click it and Unblock the Notifications