మేధా స్కూల్ కరస్పాండెంట్ రిమాండ్.. చంచల్ గూడ జైలుకు..
బోయిన్ పల్లి మేధా స్కూల్ లో డ్రగ్స్ తయారీ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మేధా స్కూల్ కరస్పాండెంట్ అరెస్ట్ అయ్యారు. మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్ ను ఈగల్ టీం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచింది. అయితే కోర్టు అతడికి 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతడ్ని చంచల్ గూడ జైలుకు తరలించారు.
అయితే పోలీసులు కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటపడ్డాయి. మేధా స్కూల్ కరస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్ ఎవరికీ అనుమానం రాకుండా తన పాఠశాలనే డ్రగ్స్ తయారీకి అడ్డాగా మార్చుకున్నట్లు సమాచారం. పగటిపూట, సాయంత్రం వరకు పాఠశాలను నడిపించి రాత్రిళ్లు మత్తుమందును తయారు చేసేవాడని తేలింది. అలా ఆ డ్రగ్స్ ను సరఫరా చేసేవాడని స్పష్టమైంది.
ఇక గురువారెడ్డి అనే వ్యక్తి నుంచి జయప్రకాష్ గౌడ్ మత్తుమందు తయారీ ఫార్ములాను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మందును తయారు చేసే క్రమంలో ఆరుసార్లు విఫలమై ఏడోసారి విజయవంతమైనట్లు సమాచారం. అలా తయారైన మత్తుమందును కల్లులో కలిపి విక్రయించేవాడు. కస్టమర్ల నుంచి మంచి స్పందన రావడంతో ఈ వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. అలా రోజుకు కిలో చొప్పున మత్తుమందును తయారు చేసి, మహబూబ్ నగర్, హైదరాబాద్ లోని పలు కల్లు కాంపౌండ్‌లకు సరఫరా చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.

మరోవైపు మేధా పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. విద్యార్థుల భవితవ్యంపై తల్లిదండ్రుల ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని విద్యాశాఖ అధికారులు ప్రత్యామ్నాయ మార్గం చూపించాలని కోరారు. ఇప్పటికే 70 శాతం ఫీజులను చెల్లించినట్లుగా చెప్పారు. దీనిపై అధికారులు వెంటనే స్పందించాలని వారు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications