రెండు రోజుల్లో పెళ్లి: విషపు ఇంజక్షన్ తీసుకుని మెడికో ఆత్మహత్య
హైదరాబాద్: రెండు రోజుల్లో వివాహం జరగాల్సి ఉండగా ఓ మెడికల్ విద్యార్థిని విషపు ఇంజక్షన్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన హైదరాబాదులోని చైతన్యపురి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సమతాపురి కాలనీలో సోమవారం రాత్రి జరిగింది.
నాగోల్ సమతాపురి కాలనీలోని రోడ్‌నంబర్ 3లో నివసించే ఆలూరి కినీరా (29) ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ చదువుతోంది. ఆమె తండ్రి సజన్న ఏపీభవన్‌లో ఉద్యోగం చేసి పదవీ విరమణ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. అప్పటి నుంచి కినీరా మనస్తాపం చెందుతోంది.

కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన డాక్టర్‌తో ఆమెకు వివాహం నిశ్చయమైంది. గురువారం పెళ్లి జరగాల్సి ఉన్నది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం తల్లి, బంధువులతో కలిసి షాపింగ్ కూడా చేసిన కినీరా అదేరోజు రాత్రి పాయిజన్ ఇంజక్షన్ తీసుకుని ఆత్మహత్యకు చేసుకుంది.
ఒక్కతే కూతురు కావడం, తండ్రి మరణం, పెళ్లయితే తల్లి ఒంటరవుతుందనే బెంగతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications