మెడికో ప్రీతి మృతి కేసు: వరంగల్ సీపీ సంచలన ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేఎంసి పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి మృతి కేసు పై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రీతి ఆత్మహత్య చేసుకుందని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు. ప్రీతి ఆత్మహత్యకు మెడికో సైఫ్ ప్రధాన కారకుడని ఏవి రంగనాథ్ తెలిపారు.
సీనియర్ మెడికల్ విద్యార్థి సైఫ్ వేధింపుల వల్లే ప్రీతి ఆత్మహత్యకు పాల్పడిందని వరంగల్ సిపి రంగనాథ్ వెల్లడించారు. ఈ కేసులో పది రోజుల్లో చార్జిషీట్ దాఖలు చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఇంజక్షన్ ద్వారా పాయిజన్ తీసుకోవడం వల్లే ప్రీతి మృతి చెందిందని వరంగల్ సిపి రంగనాథ్ ప్రకటించారు. ఇదిలా ఉంటే ప్రీతి మృతికి కారణమైన మెడికో సైఫ్ కు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

కోర్టు బెయిల్ మంజూరు చేయటంతో సైఫ్ నేడు ఖమ్మం జైలు నుండి బయటకు వచ్చాడు. పదివేల రూపాయల బాండ్ మరియు ఇద్దరి వ్యక్తిగత పూచీకత్తుపై నిందితుడు సైఫ్ కు ఎస్సీ, ఎస్టీ కోర్టు న్యాయమూర్తి సత్యేంద్ర బెయిల్ మంజూరు చేశారు. అయితే ప్రీతి మృతి కేసు విషయంలో ఆమెది హత్య అని ప్రీతి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
టాక్సికాలజీ రిపోర్ట్ సైతం ఆమె శరీరంలో ఎటువంటి విషపదార్థాలు లేవని వెల్లడించింది. దీంతో ప్రీతి మృతి విషయంలో అసలేం జరిగింది అన్నదానిపై మిస్టరీ వీడలేదు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ ఈ అనుమానాలకు తెర దించారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఆమెది ఆత్మహత్య అన్నది స్పష్టంగా తెలిసిందన్నారు. ప్రీతి మృతికి కారణం ఆమె ఆత్మహత్యకు పాల్పడటమేనని, నిందితుడు సైఫుద్దీన్ వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుందని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications