నోటుకు ఓటు కేసు: కేంద్రాన్నైనా ఢీకొంటామని కెసిఆర్
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని, దాన్ని ఆసరా చేసుకుని సెక్షన్ 8 అమలంటూ రాజకీయం చేస్తే తాను ప్రతిఘటిస్తానని, ఈ విషయంలో కేంద్రం తెలంగాణ ప్రభుత్వ మనోగతాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ముందుకుూ సాగితే గట్టి ఎదుర్కుంటామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు గవర్నర్ నరసింహన్‌తో అన్నట్లు సమాచారం. ఆయన సోమవారంనాడు గవర్నర్‌తో గంటన్నర పాటు సమావేశమైన విషయం తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ మంత్రుల బృందం తనను కలిసినప్పుడు, తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎవరి ఫోన్ల ట్యాపింగ్‌నకు కూడా పాల్పడలేదని తాను వారికి స్పష్టంగా చెప్పానని కేసీఆర్‌తో గవర్నర్ అన్నట్లు తెలిసింది. స్టింగ్ ఆపరేషన్ కేసు విషయంలో తాము అంతా చట్టప్రకారమే ముందుకు సాగుతున్నామని, దీని నుంచి దోషులను తప్పించడానికే సెక్షన్ 8ని ముందుకు తెస్తున్నారని కెసిఆర్ అన్నట్లు చెబుతున్నారు.

ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తన భద్రత కోసం తెలంగాణ పోలీసులను కాదని, ఏపీ పోలీసులను నియమించుకోవడంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రాష్ట్ర విభజన సమయంలో కంటితుడుపు చర్యగా తీసుకొచ్చిన సెక్షన్ 8ని రాజ్యాంగ వ్యతిరేకమని, దానికి మార్గదర్శకాలు రూపొందించి అమల్లోకి తేవడం అంటే రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించడమే అవుతుందని కెసిఆర్ స్పష్టం చేశారు.
సెక్షన్ 8 అమల్లో గవర్నర్‌కు సహకరించేందుకు నియమితులైన సలహాదారులు ఏపీవీఎన్ శర్మ, ఏకే మహంతిలతో ఆదివారం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబుతో భేటీ వివరాలను సలహాదారులు గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. సెక్షన్ 8 అమలు విషయంలో చంద్రబాబు గట్టి పట్టుదలతో ఉన్నారని, ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమే సమంజసంగా ఉంటుందని సలహాదారులిద్దరూ గవర్నర్‌కు సూచించినట్లు తెలిసింది.

ఈ స్థితిలో సెక్షన్ 8 అమలుపై తాను నిర్ణయం తీసుకోవడానికి బదులుగా దానిపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటో తెలుసుకోవాలని గవర్నర్ నరసింహన్ భావించారు. అందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను సోమవారం రాజ్‌భవన్‌కు పిలిపించి ఈ అంశంపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలు, సెక్షన్ 8 అమలుకు ఏపీ ప్రభుత్వం పట్టుపడుతుండటం, ఈ విషయంలో కేంద్ర సర్కారు మనోగతం, స్టింగ్ ఆపరేషన్‌పై కేంద్రం, ఏపీ ప్రభుత్వాల వైఖరి వంటి అంశాలు వారి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది.
ఒక రాష్ట్ర రాజధానిలో మరో రాష్ట్రానికి చెందిన పోలీసుల ప్రమేయం ఉండడం, ఒక రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉండగా, శాంతి భద్రతలను గవర్నర్ చేతిలో పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని సీఎం కేసీఆర్ స్పష్టం చేసినట్లు తెలిసింది.












Click it and Unblock the Notifications