Rains Alert: తెలంగాణలో రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వానలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో శుక్ర, శనివారాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణం కేంద్రం హెచ్చరించింది. పశ్చిమ బెంగాల్, ఉ త్తర ఈశాన్య బంగాళాఖాతానికి ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈ అల్పపీడనం కేంద్రికృతమై ఉన్నట్లు వివరించింది. ఈ అల్పపీడనం ప్రభావంతోనే అతి భారీ వానలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.
ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని అంచనా వేసింది. వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. కరీంనగర్, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ నిజామాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని పేర్కొంది. చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉన్నట్లు వివరించింది.

శనివారం కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు పడే ఛాన్సు ఉందని పేర్కొంది. ఆదివారం కుమురంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో తేలిపాటి నుంచి మోస్తర్ వర్షాలు పడొచ్చని అంచనా వేసింది.

హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి వర్షం కురుస్తోంది. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, యూసఫ్ గూడ, రహమతి నగర్, మోతి నగర్, బోరబండలో వాన పడింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అటు ఏపీలోని వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 40 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.












Click it and Unblock the Notifications