మిల్లెట్ మ్యాన్ పీవీ సతీష్ కన్నుమూత
మిల్లెట్ మ్యాన్‌గా ప్రాచుర్యం పొందిన పీవీ సతీష్ కన్నుమూశారు.
హైదరాబాద్: మిల్లెట్ మ్యాన్‌గా ప్రాచుర్యం పొందిన పీవీ సతీష్(77) కన్నుమూశారు. కొన్నేళ్లుగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుది శ్వాస విడిచారు. సేంద్రియ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం దశాబ్దాలుగా కృషి చేసినందుకు పీవీ సతీష్‌ను 'మిల్లెట్ మ్యాన్'(Millet man pv satheesh)గా పిలుస్తారు.
కాగా, హైదరాబాద్‌లోని దూరదర్శన్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. 1945 జూన్ 18న కర్ణాటకలో జన్మించిన పీవీ సతీష్.. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కేంద్రంగా దక్కన్ డెవలప్‌మెంట్ సొసైటీని స్థాపించారు. రసాయన ఎరువులకు ప్రత్యామ్నాయంగా సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తూ రైతుల్లో అవగాహన కల్పించారు సతీష్. జహీరాబాద్ ప్రాంతంలో దళిత మహిళా సాధికారతకు పీవీ సతీష్ విశేషంగా కృషి చేశారు.

హైదరాబాద్-ముంబై జాతీయ రహదారిపై తొలి మిల్లెట్స్ కేఫ్ ఏర్పాటుకు తన వంతు కృషి చేశారు సతీష్. 30 ఏళ్ల క్రితం మొదటిసారిగా ప్రపంచవ్యాప్త చర్చలో చిరుధాన్యాలను ప్రవేశపెట్టడంలో సఫలీకృతులయ్యారు. సేంద్రీయ వ్యవసాయం, చిరుధాన్యాల సాగు కోసం 4 దశాబ్దాలుగా కృషి చేశారు. ప్రత్యేకించి చిన్న కమతాల్లో పెట్టుబడి లేకుండా.. చిరుధాన్యాల పంటల సాగు, విస్తీర్ణం, వినియోగం పెంపు కోసం కృషి చేశారు.
ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలను చేర్చడంతోపాటు 2018 సంవత్సరాన్ని కేంద్రం జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించడంలో పీవీ సతీష్ కీలక పాత్ర పోషించారు. ఈయన కృషికి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు కూడా లభించాయి. సతీష్ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సోమవారం సంగారెడ్డిలో ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.












Click it and Unblock the Notifications