నిరూపిస్తే రాజీనామా చేస్తా.. లేదంటే రేవంత్, షర్మిల రాజకీయసన్యాసం తీసుకుంటారా? మంత్రి ఎర్రబెల్లి సవాల్!!
తనపైన షర్మిల, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అబద్ధాలని, నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే వారు తమ పదవులకు రాజీనామా చేసి రాజకీయసన్యాసం తీసుకుంటారా అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు.
పాలకుర్తి నియోజకవర్గంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల చేస్తున్న పాదయాత్ర లలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళిద్దరికీ తనను కామెంట్ చేసే అర్హత లేదన్నారు. తన పైన షర్మిల, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అన్ని అబద్ధాలేనని, నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, నిరూపించలేకపోతే వారు తమ పదవులకు రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటారా అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సవాల్ విసిరారు.

రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్
అసలు రేవంత్ రెడ్డికి, వైఎస్ షర్మిలకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ అని మండిపడ్డారు. తనకు ఓనమాలు రావని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తాను ఇంటర్ చదువుకున్నానని, పెద్దగా చదువుకోకపోయినప్పటికీ, ప్రజల మనోభావాలు చదివానంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రజల అవసరాలను తీరుస్తూ, అభివృద్ధి చేస్తున్నానని అందుకే తనను ప్రజలు గెలిపిస్తూ వస్తున్నారని ఎర్రబెల్లి పేర్కొన్నారు.

రేవంత్ పైన ఒక ఉద్యమ కేసైనా ఉందా?
ఆరుసార్లు ఓటమి లేకుండా గెలిచిన ఎమ్మెల్యేని తానని చెప్పుకున్న ఎర్రబెల్లి, ఒకసారి ఎంపీగా కూడా గెలిచానంటూ వ్యాఖ్యలు చేశారు. అలవికాని అబద్ధాలు చెబుతున్న రేవంత్, షర్మిళ ల మాటలు ప్రజలు నమ్మబోరని ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ ఉద్యమం కోసం ఎంతో చేశానని, రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రేవంత్ పైన ఒక ఉద్యమ కేసైనా ఉందా అంటూ నిలదీశారు. రేవంత్ మాత్రమే కాదు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరి పైన భూ కబ్జాల కేసులు ఉన్నాయని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు.

రేవంత్ కొడంగల్ లో గెలుస్తావా?
ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లాడని ఉద్యమంలో కాదని ఎద్దేవా చేశారు. తాను ఎక్కడ నిలబడినా మళ్లీ గెలుస్తానని, రేవంత్ కొడంగల్ లో గెలుస్తాడా అంటూ ప్రశ్నించారు. మల్కాజ్గిరి లో మళ్లీ పోటీ చేస్తావా అంటూ నిలదీశారు. నువ్వు నా గురించి మాట్లాడే వాడివయ్యావా అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నీ గురించి మీ కాంగ్రెస్ పార్టీ వాళ్లే మాట్లాడుతున్నారని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నాశనమేనని, కాంగ్రెస్ పార్టీ కూడా నాశనం అవుతుందని చెప్పుకొచ్చారు.

మీ నాన్న పేరు చెడగొట్టకు షర్మిల
ఇక వైయస్ షర్మిల ను టార్గెట్ చేసిన మంత్రి ఎర్రబెల్లి కొద్దిగా మీ నాన్నకు మంచి పేరు ఉంది దాన్ని చెడగొట్టకు అంటూ షర్మిలకు హితవు పలికారు. సంస్కారాన్ని పాటించి మాట్లాడాలని సూచించారు. మహిళ అన్న విషయాన్ని మరిచిపోయి షర్మిల మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 500 మంది కిరాయి గూండాలు... 200 కార్లు... కాంట్రాక్ట్ పద్ధతిలో పాద యాత్ర చేస్తున్న మీరు మా గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. పాదయాత్రల పరువు తీస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తున్నారని, రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని పేర్కొన్నారు.

వాళ్ళు చచ్చిన పాములు అని నేనే మిమ్మల్ని అడ్డుకోవద్దని చెప్పా
రేవంత్ రెడ్డి, వైఎస్ షర్మిల ల పాద యాత్రను నిలిపి వేస్తామని మా పార్టీ కార్యకర్తలు, ప్రజలు పట్టు పడితే, నేనే వద్దని వారించానని ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. వాళ్ళు చచ్చిన పాములు... వద్దని నేనే వాళ్ళను ఆపానన్నారు. నేనే ఒకవేళ అడ్డుకోవాలనుకుంటే,మీరు జనగామ జిల్లాలో, పాలకుర్తి నియోజకవర్గంలో తిరిగే వారా? అంటూ ప్రశ్నించారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడొద్దు అంటూ హెచ్చరించారు. మీ కల్లబొల్లి మాటలను ప్రజలెవరూ నమ్మబోరని తేల్చి చెప్పారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.












Click it and Unblock the Notifications