జెన్‌కోకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
శ్రీశైలం హైడెల్ పపర్ ప్రాజెక్టు ద్వారా డిమాండ్‌కు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులను ఆదేశించారు. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తిని పెంచుకునే సౌలభ్యం ఉందని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు జలహారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు.
అనంతరం కుడి హైడెల్ పవర్ కేంద్రాన్ని సందర్శించి జెన్‌కో ఉన్నతాధికారులతో మంత్రి రవికుమార్ సమీక్షించారు. ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఒక్క జులై నెలలోనే 100 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందని అధికారులు వివరించారు.

7 యూనిట్ల ద్వారా రోజుకు ఎన్ని యూనిట్లు ఉత్పత్తి అవుతోందని అధికారులను అడగ్గా.. 7 యూనిట్ల ద్వారా రోజుకు 15 నుంచి 16 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోందని చెప్పారు. ఆగస్టులో 250 మిలియన్ యూనిట్లు ఉత్పత్తే లక్ష్యంగా పెట్టుకున్నామని.. వరద ప్రవాహం ఇలాగే కొనసాగినట్లయితే 300 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
నీటి ప్రవాహం అధికంగా ఉన్నందున ఉత్పత్తిని అనుకున్న స్థాయిలో పెంచాలని మంత్రి అధికారులకు సూచించారు. కరెంట్ కోతలు లేని ఆంధ్రప్రదేశ్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని.. ప్రజల అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచడం పై దృష్టి సారించాలని అధికారులకు స్పష్టం చేశారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటై మన ప్రభుత్వం రెన్యూబల్ ఎనర్జీకి కీలక ప్రాధాన్యం ఇస్తుందని సమీక్ష సమావేశంలో మంత్రి రవికుమార్ తెలిపారు. 2014-2019 మధ్య కాలంలో మిగలు విద్యుత్ రాష్ట్రంగా ఏపీ ఎలా అవతరించిందో అదే విధంగా మరోసారి ముందడుగు వేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమీక్షలో ఎపీ జెన్‌కో ఎండీ కేవీఎన్ చక్రధర్ బాబు, డైరెక్టర్ సుజయ్ కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications