బండి సంజయ్ కు సవాల్ విసిరి; కేంద్రం తీరుపైనా ధ్వజమెత్తిన మంత్రి హరీష్ రావు
కేంద్ర ప్రభుత్వ తీరుపై, తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులపై, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదగిరిగుట్టలో నిర్వహించిన టిఆర్ఎస్వి, టీఆర్ఎస్ యువజన విభాగం, ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు కేంద్రంలోని బీజేపీ తీరుపై నిప్పులు చెరిగారు. నిరుద్యోగ సమస్యపై నిర్వహించే మిలియన్ మార్చ్ హైదరాబాద్ లో కాకుండా న్యూఢిల్లీలో నిర్వహించాలని బండి సంజయ్ కు మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. తమ హయాంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో వెల్లడించాలని కేంద్రాన్ని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
Recommended Video

నిరుద్యోగులపై ఆందోళన ఉంటే ముందు ఢిల్లీలో మిలియన్ మార్చ్ చెయ్
వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 15 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, దేశంలోని అన్ని ఖాళీ పోస్టుల భర్తీకి టైమ్ ఫ్రేమ్ ప్రకటించాలని మోదీ ప్రభుత్వాన్ని మంత్రి హరీష్ రావు కోరారు. టిఆర్ఎస్ ప్రభుత్వం పై బండి సంజయ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ విషయంలో సత్యదూరమైన విషయాలు చెబుతున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నిరుద్యోగ యువత గురించి బండి సంజయ్ ఆందోళన చెందితే ముందు తమ పార్టీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి న్యూఢిల్లీలో మిలియన్ మార్చ్ చేపట్టాలని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి నిధులు, అధికారాల పంపిణీపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చెయ్యాలి
ఇక ఇదే సమయంలో దళితులు, పేదల అభ్యున్నతి కోసం డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ కలలుగన్న లక్ష్యాన్ని సాకారం చేయడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి నిధులు, అధికారాల పంపిణీపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు.
2022-23 సంవత్సరానికి రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి (జిఎస్‌డిపి)లో కేవలం 3.5 శాతానికి రాష్ట్ర రుణ అర్హతను పరిమితం చేసి, ప్రతిఫలంగా విద్యుత్ రంగ సంస్కరణలను అమలు చేయాలని షరతు విధించినందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌పై ఆర్థిక మంత్రి టి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. జీఎస్డీపీలో మరో 0.5 శాతం పెంచడం కోసం, ఈ షరతుతో రాష్ట్ర రుణ అర్హత రూ.5,000 కోట్లు తగ్గుతుందని హరీశ్ రావు తెలిపారు.

రుణ అర్హత 3.5 శాతానికి పరిమితం చెయ్యటంతో తెలంగాణాకు నష్టం
2021-22లో జీఎస్‌డీపీలో 4 శాతానికి ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఎఫ్‌ఆర్‌బీఎం) పరిమితిని పెంచేందుకు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అనుమతించిందని తెలిపారు. కానీ, నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో, 2022-23లో, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారం, రాష్ట్రాలకు జీఎస్డీపీలో 4 శాతం వరకు అనుమతించబడుతుంది.
అందులో 0.5 శాతం విద్యుత్ రంగ సంస్కరణలతో ముడిపడి ఉంటుంది అని పేర్కొన్నారని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం, తెలంగాణ ఎఫ్ఆర్బీఎం చట్టం ప్రకారం జీఎస్డీపీలో 4 శాతం పరిమితి వరకు రుణాలకు అర్హత పొందుతుంది. 2021-22లో, మేము 4 శాతం వరకు రుణాలను పెంచాము. కానీ, 2022-23లో, రుణ అర్హత 3.5 శాతానికి పరిమితం చేయబడిందని, దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతుందని హరీష్ రావు వెల్లడించారు.

విద్యుత్ సంస్కరణల పేరుతో రైతులకు కష్టాలు, మోడీ హయాంలో రైతులకు భద్రత లేదు
విద్యుత్ శాఖ సంస్కరణలంటే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడమేనన్నారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు కావాలా అని రైతులను హరీశ్ ప్రశ్నించారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు అక్కర్లేదు, బీజేపీ కూడా అక్కర్లేదని రైతులు బిజెపి కి సమాధానం చెప్పాలన్నారు మంత్రి హరీష్ రావు . కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయ ధరల స్థిరీకరణ నిధిని సగానికి తగ్గించారని, ఇది రైతులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని హరీశ్ ఉన్నారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని కానీ, బీజేపీ ప్రభుత్వం వారి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని హరీష్ రావ్ తేల్చిచెప్పారు. నరేంద్ర మోదీ హయాంలో రైతులకు భద్రత లేదు అని ఆర్థిక మంత్రి హరీష్ రావు ఆరోపించారు.












Click it and Unblock the Notifications