కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు.. నమ్మితే మోసపోతాం: మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. తాజాగా నిజామాబాద్ అర్బన్ రోడ్ షో లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే హామీలను నమ్మితే మోసపోతాం అని, కాంగ్రెస్ మేనిఫెస్టోను నమ్మొద్దు అని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపిస్తుందని దుయ్యబట్టారు.
గులాబీ జెండా అధికారంలోకి రాకముందు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అనేది ప్రజలు ఒకసారి ఆలోచించాలి అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 2000 రూపాయలు పించన్ ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో 5 వేల రూపాయల పింఛన్ ఇవ్వబోతున్నామన్నారు . నాడు నీళ్ళ కోసం ఎంతో గోస పడ్డామని పేర్కొన్న హరీష్ రావు, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా అంటూ ప్రశ్నించారు.

నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే నేడు పోదాం పద సర్కారు దవాఖాన అంటున్నారన్నారు. మోకాలు చిప్ప ఆపరేషన్లు ఉచితంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేస్తున్నాం అని తెలిపారు. కరోనా వస్తే కడుపులో పెట్టుకొని కాపాడుకున్నామన్నారు. గల్లీ గల్లీ తిరిగి మీ ఎమ్మెల్యే మీకు అండగా ఉన్నాడని పేర్కొన్నారు.
రేషన్ షాప్ ల ద్వారా భవిష్యత్తులో సన్నబియ్యం ఇవ్వబోతున్నామని, మహిళల కోసం సౌభాగ్య లక్ష్మి పథకం అమలు చేయబోతున్నామని, మన ప్రభుత్వ రాగానే 400 రూపాయలకే సిలిండర్ ఇవ్వబోతున్నామని పేర్కొన్నారు. రైతు భీమా లాగా కోటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల బీమా అందించబోతున్నామని తెలిపారు.
ఓడ దాటే దాకా ఓడ మల్లన్న ఓడ దాటినాక బోడి మల్లన్న అన్నట్టు కాంగ్రెస్ తీరు ఉంటుందని, నమ్మి ఓటు వేస్తే నట్టేట ముంచారని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రస్తుతం మళ్ళీ ఆపదమొక్కులు మొక్కుతున్నారు అని, కాంగ్రెస్ చెప్పే కాకమ్మ కథలు నమ్మొద్దు అని హరీష్ రావు సూచించారు. కెసిఆర్ గెలిస్తే అందరం బాగు పడతాం అని, లేదంటే అందరం బాధ పడతామని మంత్రి హరీష్ రావు తెలిపారు.












Click it and Unblock the Notifications