జాగ్రత్త: స్మితా సభర్వాల్ వ్యాఖ్యలపై కొండా సురేఖ ఏమన్నారంటే?
అఖిల భారత సర్వీసుల్లో దివ్యాంగుల రిజర్వేషన్ల అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్‌పై మంత్రి కొండా సురేఖ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారు హుందాగా వ్యవహరించాలని, ప్రభుత్వ వ్యవస్థల్లో భాగమైన వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేశారు.
తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీ స్మితా సభర్వాల్‌కు ఈ మేరకు సూచించారు. దివ్యాంగులపై స్మితా సభర్వాల్ చేసిన వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యంగా ఉన్నాయన్నారు. ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి, పర్యవసానాలను ఆలోచించకుండా మాట్లాడటం సరికాదన్నారు మంత్రి కొండా సురేఖ. తమ మాటల ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం వెళుతుందో దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు.

శారీరక సామర్థ్యం కంటే మానసక సామర్థ్యమే ముఖ్యమని స్మితా సభర్వాల్ గుర్తించాలన్నారు మంత్రి కొండా సురేఖ. గొప్ప సంకల్ప బలంతో శారీరక దుర్బలత్వాన్ని జయించి ఈ ప్రపంచానికి స్ఫూర్తిప్రదాతలుగా నిలిచిన మహోన్నత వ్యక్తులెందరో ఉన్నారనే విషయాన్ని స్మితా సభర్వాల్ గుర్తించాలన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో వివక్షకు తావులేదని, అన్ని వర్గాల హక్కులకు రక్షణ ఉంటుందని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు.
అంతకుముందు మంత్రి సీతక్క కూడా స్మితా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. స్మితా సభర్వాల్ వ్యాఖ్యల వెనుక వేరే ఆలోచన కనిపిస్తోందన్నారు. ఆమెకు ఫ్యూడల్ భావజాలం ఉందని, ఆమె తన మానసిక ఆలోచన విధానాన్ని మార్చుకోవాలని మంత్రి సీతక్క హితవు పలికారు.
తను అభిప్రాయాన్ని వ్యక్తిగతంగా ఉంచుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఒక అధికారి ఫిజికల్ ఫిట్నెస్ గురించి స్మితా సభర్వాల్ స్పందించడం తప్పుగా పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటన చేసే ఉద్యోగాలకు ఆఫీసులో చేసే ఉద్యోగానికి తేడా తెలుసుకుని మాట్లాడాలని స్మితా సభర్వాల్‌కు హితవు పలికారు. స్మితా సభర్వాల్ వ్యాఖ్యలు సీఎం దృష్టికి వెళ్లి ఉంటాయని అభిప్రాయపడ్డారు. తాను కూడా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానని మంత్రి సీతక్క తెలిపారు. కాగా, సివిల్ సర్వీసుల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదంటూ స్మితా సభర్వాల్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications