శుభవార్త చెప్పిన మంత్రి కొండా సురేఖ
త్వరలోనే దేవాదాయ శాఖలో సిబ్బంది కొరత తీరుస్తామని, సిబ్బందిని భర్తీ చేస్తామని దేవాదాయ శాఖామంత్రి కొండా సురేఖ శుభవార్త చెప్పారు. దేవాదాయ శాఖలో ఎంతో కాలంగా సిబ్బంది కొరత వేధిస్తున్న క్రమంలో తాజాగా ఆ అంశంపై మాట్లాడిన కొండా సురేఖ ఆ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వేదాభ్యాసకులకు ఉపయోగపడేలా వేద పాఠశాలను రూ. 1.3కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న క్రమంలో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ఈ విషయాన్ని వెల్లడించారు.
రూ.1.3కోట్ల వ్యయంతో భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయ నిర్మాణం
నేడు భద్రకాళి దేవస్థానం సమీపంలో రూ.1.3కోట్ల వ్యయంతో శ్రీ భద్రకాళి సాంగవేద ఆగమ సంస్కృత విద్యాలయ భవన నిర్మాణ పనులను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ల తో కలిసి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ శిలాఫలకాన్ని ఆవిష్కరించి శంకుస్థాపన చేసి నిర్మాణ పనులను ప్రారంభించారు. అదేవిధంగా భద్రకాళి ఆలయం ముందు రాజగోపుర నిర్మాణ పనుల శిలాఫలకాన్ని మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఆలయాల గురించి తెలుసుకునేందుకు వెబ్సైట్ లు
ఈ సందర్భంగా రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ వేద పాఠశాల ఏర్పాటుకు నిధులు మంజూరు చేసి శంకుస్థాపన చేసినట్లు పేర్కొన్నారు. ఏ ఊరిలో ఏ గుడి ఉందో వెబ్సైట్ ద్వారా తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా దాతలు గుడులకు దానం చేయడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఆలయాలను అభివృద్ధి చేసేందుకు దాతలు ముందుకు వచ్చే విధంగా వెబ్సైట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు.

అర్చకులకు పదోన్నతులను కల్పించాం
గత కొన్నేళ్లుగా మూలకు పడి ఉన్న దేవాదాయ శాఖ దస్త్రాలను బయటకు తీస్తున్నట్లు పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఆగిపోయిన అర్చకుల పదోన్నతులను కల్పించినట్లు తెలిపారు.
ఎన్నడూ లేని విధంగా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరను బ్రహ్మాండంగా నిర్వహించామని పేర్కొన్నారు. గతేడాది బోనాల జాతరను కూడా వైభవంగా నిర్వహించామని తెలిపారు. ఈసారి కూడా బోనాల జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు ఆరో తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సరస్వతి పుష్కరాలను అద్భుతంగా నిర్వహించారని పేర్కొన్నారు.
దేవాదాయ శాఖ భూముల ఆక్రమణ లపై ఉక్కుపాదం మోపుతాం
దేవాదాయ శాఖ భూములు ఆక్రమించిన వారు స్వచ్ఛందంగా భూములు తిరిగి ఇవ్వాలని లేకపోతే చట్ట ప్రకారం ముందుకెళ్తామన్నారు. చట్ట ప్రకారం దేవాదాయ భూములను వెనక్కి తీసుకుంటామన్నారు. కోట్లాది రూపాయల విలువైన దేవాదాయశాఖ భూములను అక్రమంగా ఆక్రమించడం చట్ట విరుద్ధమన్నారు. వేద పాఠశాల నిర్మాణానికి అనువైన స్థలం గుర్తించి , నిర్మాణానికి నిధులను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.భద్రకాళి మాఢ వీధుల నిర్మాణ పనులకు దాదాపు రూ.30 కోట్లను మంజూరు చేసినట్లు తెలిపారు.
వరంగల్ లో ఆర్కియాలజీ పరిధిలోని ఆలయాలపై దృష్టి సారిస్తాం
రాబోయే రోజుల్లో వరంగల్లోని అన్ని ఆలయాలను ప్రత్యేక దృష్టితో చూస్తామని, ఆర్కియాలజీ పరిధిలో ఉన్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ఫోర్ట్, వరంగల్ లో 14 ఆలయాలు బయటకు వచ్చాయని అన్నారు. ఆలయాలు చెక్కుచెదరకుండా ఉన్నాయని, ఆలయాల్లోపల విగ్రహాలు లేవని పేర్కొన్నారు. సమస్య ఎక్కడ వస్తుందంటే ఆర్కియాలజీ వాళ్లను అడిగినప్పుడు ఉన్నదున్నట్లు ఉంచి పూజలు చేసుకోవాలని, ఏ పని చేయడానికి వీలులేదని వారు చెబుతున్నారని అన్నారు.
వరంగల్ ను టూరిజం స్పాట్ గా డెవలప్ చేస్తాం
ఆర్కియాలజీ పర్మిషన్ కు రాయనున్నట్లు తెలిపారు. ఆలయాలకు సంబంధించి చరిత్ర ఉందని, ఆ చరిత్ర ప్రకారం ఆ దేవుళ్లను ప్రతిష్టించి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. ఫోర్ట్ వరంగల్ కు చాలామంది సందర్శకులు వస్తుంటారని, ఆలయాల పునరుద్ధరణతో టూరిజం స్పాట్ గా డెవలప్ అవుతుందన్నారు. దీంతో రెవెన్యూ అభివృద్ధి చెందుతుందన్నారు. అన్ని దేవాలయాలను పరిశీలించాలని, సరైన మాస్టర్ ప్లాన్ ను రూపొందించాలని సలహాదారు గోవిందు హరి కి సూచించినట్లు తెలిపారు.
రానున్న రోజుల్లో వరంగల్ ఆలయాలను మరింత అభివృద్ధి చేస్తాం
రానున్న రోజుల్లో వరంగల్ లోని దేవాలయాలను మరింత అభివృద్ధి చేసి ఎక్కువమంది భక్తులు సందర్శించుకునే విధంగా మంచి మార్గాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. వరంగల్ నగరం చారిత్రాత్మక నగరం అని, కాకతీయులు ఏలిన ఈ నగరానికి తిరిగి ఆ వన్నెను తీసుకురావడానికి పాలకులుగా తమపై బాధ్యత ఉందన్నారు.












Click it and Unblock the Notifications