తెలంగాణలో ఇద్దరు బీజేపీ ఎంపీలపై ఫేక్ సర్టిఫికెట్ల ఆరోపణలు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్హతల వ్యవహారంపై చెలరేగిన ప్రకంపలు ఇప్పుడే తగ్గేలా కనిపించట్లేదు. ఆయన డిగ్రీ సర్టిఫికెట్లను చూపించాలని అడిగినందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై గుజరాత్ హైకోర్టు ఏకంగా పాతిక వేల రూపాయల జరిమానా విధించిన అనంతరం పలువురు ప్రతిపక్ష పార్టీల నాయకులు స్పందిస్తోన్నారు. స్వచ్ఛందంగా తమ విద్యార్హతలను తెలియజేస్తోన్నారు. సర్టిఫికెట్లను సోషల్ మీడియాల్లో పోస్ట్ చేస్తోన్నారు.
ఈ క్రమంలో తెలంగాణ మంత్రి, భారత్ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా తన విద్యార్హతలను తెలియజేసిన విషయం తెలిసిందే. పుణే యూనివర్శిటీలో కేటీఆర్ చదువుకున్నారు. అక్కడ బయో టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. సిటీ యూనివర్శిటీ ఆఫ్ న్యూయార్క్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. ఆ సర్టిఫికెట్లను షేర్ చేయడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.

ప్రధాని మోదీ విద్యార్హతలను ప్రశ్నించిన అరవింద్ కేజ్రీవాల్ పై గుజరాత్ హైకోర్టు భారీగా జరిమానా విధించిన నేపథ్యంలో కేటీఆర్ తన విద్యార్హతలను బయటపెట్టారు. ఇప్పుడు తాజాగా ఆయన మరో ఆరోపణ చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన ఇద్దరు తెలంగాణ లోక్‌సభ సభ్యులు కూడా నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లను తెచ్చుకున్నారని చెప్పారు. రాజస్థాన్, తెలంగాణ యూనివర్శిటీల నుంచి ఫేక్ డిగ్రీ సర్టిఫికెట్లను తెచ్చుకుని తాము విద్యావంతులమని చెప్పుకొంటోన్నారని అన్నారు.
ఈ విషయంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. దోషులుగా తేలితే లోక్‌సభ స్పీకర్ ఆ ఇద్దరు బీజేపీ ఎంపీలపైన కూడా అనర్హత వేటు వేయగలరా? అని ప్రశ్నించారు. ఆ నకిలీ డిగ్రీ సర్టిఫికెట్లతోనే తాము విద్యావంతులమని ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చారని గుర్తు చేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ప్రాతిపదికన తీసుకుంటే- వారిద్దరు కూడా అనర్హత వేటుకు అర్హులేనని అన్నారు. చూస్తోంటే తెలంగాణలో మున్నాభాయ్ ఎంబీబీఎస్ టైప్ నాయకులు చాలామందే ఉన్నట్లు కనిపిస్తోన్నారని ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ డిగ్రీ సర్టిఫికెట్ల వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. 1978లో గుజరాత్ యూనివర్శిటీ నుంచి డిగ్రీ పూర్తి చేసినట్లు లోక్‌సభ ఎన్నికల సమయంలో తాను దాఖలు చేసిన నామినేషన్ పత్రాల్లో పొందుపరిచారు ప్రధాని మోదీ. 1983లో ఢిల్లీ యూనివర్శిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినట్లూ పేర్కొన్నారు. దీని ఆధారంగా అరవింద్ కేజ్రీవాల్- మోదీ విద్యార్హతలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలంటూ విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications