అసెంబ్లీ ఎన్నికల వేళ: ఉల్లాసంగా.. ఉత్సాహంగా కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. అక్టోబర్/నవంబర్‌లల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. డిసెంబర్ నాటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావొచ్చు. ఈ ఎన్నికలను ఎదుర్కొనడానికి అన్ని పార్టీలు కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార భారత్ రాష్ట్ర సమితి, కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ.. సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.
వరుసగా మూడోసారి అధికారంలోకి రావడానికి అవసరమైన ప్రణాళికలన్నింటినీ రూపొందించుకుంటోంది బీఆర్ఎస్. హ్యాట్రిక్ కొట్టి తీరాలనే లక్ష్యంతో పని చేస్తోంది. ఇందులో భాగంగా- తమ హయాంలో చోటు చేసుకున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే.. బీజేపీ, కాంగ్రెస్ వైఖరినీ ఎండగడుతోంది.

2014 నుంచీ కేంద్రంలో అధికారంలో ఉంటూ వస్తోన్న కమలనాథులు ఇచ్చిన హామీలన్నింటినీ జనంలోకి తీసుకెళ్లడానికి భారీ స్కెచ్ వేసింది బీఆర్ఎస్. బీజేపీ వంద అబద్ధాలు పేరుతో బీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం ప్రత్యేకంగా రూపొందించిన సీడీ, బుక్‌లెట్‌ను కేటీఆర్ ఇటీవలే ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
అటు అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమానంగా జనంలోకి తీసుకెళ్తోంది కేసీఆర్ సర్కార్. ఎన్నికల గడువు సమీపిస్తోన్న కొద్దీ ప్రజలకు వరాల జల్లను కురిపిస్తోంది. ఇటీవలే కేసీఆర్.. రైతుల పంట రుణాల మాఫీ కోసం 6,546.05 కోట్ల రూపాయలను విడుదల చేసిన విషయం తెలిసిందే. 99,999 రూపాయల రుణాల చెల్లింపు కోసం ఈ మొత్తాన్ని మంజూరు చేశారు.
తాజాగా కేటీఆర్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. జిల్లాలోని మిడ్ మానేర్ రిజర్వాయర్‌లో స్పీడ్ బోటును ప్రారంభించారు. పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రవేశపెట్టిన స్పీడ్ బోట్ ఇది. మిడ్ మానేరు జలాల్లో పర్యాటకులు తిరుగాడటానికి వీలుగా తెలంగాణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టును చేపట్టింది.
ఈ మధ్యాహ్నం కేటీఆర్.. ఈ స్పీడ్‌బోట్‌ను ప్రారంభించారు. అనంతరం దాన్ని నడిపారు. దీన్ని ప్రారంభించిన అనంతరం పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్, ఆ శాఖ ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్, పోలీస్ సూపరింటెండెంట్‌తో కలిసి ఆయన ఈ బోట్‌ను ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు బోట్‌ను నడిపారు.












Click it and Unblock the Notifications