ఆంధ్రాలో రాజకీయ ఆధిపత్యం కోసమే: బాబు, జగన్‌లపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్య
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన ప్రాజెక్టులపై ఆంధ్రా రాజకీయ నాయకుల కళ్లు పడ్డాయని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఖమ్మం జిల్లా పాలేరు ఉపఎన్నికలో మంత్రి కేటీఆర్ శనివారం ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఎవ్వరు అడ్డుపడినా, ఎవరేమన్నా గోదావరి జలాలతో ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఆంధ్రాలో రాజకీయ ఆధిపత్యం కోసం చంద్రబాబు, జగన్ తెలంగాణ ప్రాజెక్టులపై రాజకీయం చేయడం సరికాదని అన్నారు.
తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టేలా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని ఆరోపించారు. తెలంగాణ రైతాంగం పట్ల వైయస్ జగన్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ వైసీపీ నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారని ఆయన గుర్తు చేశారు. వైసీపీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన నేతలకు సముచిత స్థానం కల్పిస్తామని అన్నారు.

కాగా పాలేరు ఉపఎన్నికలో పాము, ముంగిస లాగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయని వ్యాఖ్యానించారు. గత కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్, టీడీపీలు చేయని పనిని టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుందని, ఖమ్మం జిల్లాలో 5 నుంచి 6 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని స్పష్టం చేశారు.
సీతారామ ప్రాజెక్టును పాలేరు జలాశయానికి అనుసంధానించి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని ఆయకట్టను నీరందిస్తామని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం ఏ నిబద్ధతతో పనిచేశామో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
టీఆర్ఎస్‌తోనే ఖమ్మం జిల్లాకు న్యాయం
టీఆర్ఎస్‌తోనే ఖమ్మం జిల్లాకు న్యాయం జరుగుతుందని మంత్రి, పాలేరు ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పాలేరు టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుమ్మల మాట్లాడుతూ తెలంగాణలో ఆంధ్రా పార్టీల పనైపోయిందని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్ష టీఆర్‌ఎస్‌తోనే నెరవేరుతుందని అన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాజకీయ నేతలు పనిచేయాలని కోరారు. రాజకీయాల్లో ఓపిక, ఓర్పు ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. టీఆర్‌ఎస్‌తోనే ఖమ్మం జిల్లా అభివృద్ధి సాధ్యమని, ఇతర పార్టీలతో జిల్లాకు న్యాయం జరగదని స్పష్టం చేశారు.
జాతీయ పార్టీలతో ఖమ్మం జిల్లాకు పూర్తిస్థాయి న్యాయం చేకూరే అవకాశం లేదని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్ క్లీన్‌స్వీప్ చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా సుచరితా రెడ్డి తరుపున తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఖమ్మం జిల్లాలో అధికార పార్టీ నేతలు మత్తులో ఉన్నారని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications