స్విట్జర్లాండ్ లో మంత్రి కేటీఆర్ పర్యటన.. ప్రవాస భారతీయులకు మంత్రి పిలుపు
తెలంగాణ మంత్రి కేటీఆర్ దావోస్ నగరంలో ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడం కోసం స్విట్జర్లాండ్ కి వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్నారైలు మంత్రి కేటీఆర్ కు ఘనస్వాగతం పలికారు. స్విట్జర్లాండ్ లో నేటి నుండి 20 వ తారీకు వరకు జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి కేటీఆర్ జ్యూరిక్ నగరానికి చేరుకున్నారు.
ప్రవాస భారతీయులకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి
జ్యూరిక్ విమానాశ్రయంలో, జ్యూరిక్ తో పాటు, స్విట్జర్లాండ్ లోని ఇతర నగరాలు, యూరప్ లోని ఇతర దేశాల నుంచి వచ్చిన ఎన్నారైలు మంత్రి కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు.అంతేకాదు జ్యూరిక్ నగరంలో ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమగ్ర, సమ్మిళిత, సమీకృత అభివృద్ధి సాధిస్తున్నదని, ఈ నిరంతర అభివృద్ధి ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి రావాలని ఆయన ప్రవాస భారతీయులకు విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయి
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రవాస భారతీయులను ఉద్దేశించి మాట్లాడిన క్రమంలో ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాలలో ప్రవాస భారతీయులు తమ భాగస్వామ్యాన్ని అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను, తమ తమ స్థాయిల్లో ప్రచారం చేసి రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా కృషి చేయాలని మంత్రి కేటీఆర్ కోరారు. అన్ని రంగాల్లో రాష్ట్రం అభివృద్ధి సాధించిందనీ, ఒక వైపు ఐటీ పరిశ్రమ ఉత్పత్తులు, మరోవైపు పంట ఉత్పత్తులు పలు రెట్లు పెరిగాయన్నారు.

పేదల సంక్షేమ కార్యక్రమాలను ఉచితాలనటం కూడా సరికాదు
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా కనీసం మౌలిక వసతులను సమకూరుస్తూ, పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తునట్లు పేర్కొన్నారు.రాష్ట్రానికి భారీ పెట్టుబడులను ఆకర్షించి, లక్షలాది మందికి ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజోపయోగ పనులకు చేస్తున్న ఖర్చును అప్పులని కొన్ని పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఆరోపించారు. పేదల సంక్షేమ కార్యక్రమాలను ఉచితాలనటం కూడా సరి కాదని ఆయన అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications