malla reddy: నా కొడుక్కి 'రెడ్డి' అమ్మాయితో పెళ్లి చేసుంటే పార్టీలంటూ తిరిగేది!!
Minister Malla Reddy: తెలంగాణ మంత్రి మల్లారెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడిని వైద్యుడిని చేస్తే.. వైద్యురాలైన కోడలు గిఫ్ట్ గా వచ్చిందని, అదే రెడ్డి అమ్మాయితో వివాహం చేసివుంటే కిట్టి పార్టీలు, పిక్నిక్ లంటూ తిరిగేదని వ్యాఖ్యానించారు. తన కోడలకు తల్లిదండ్రులు లేరని, ఆమెను తన మూడో కొడుకుగా చూసుకుంటున్నానంటూ భావోద్వేగానికి గురయ్యారు. ఓ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మల్లారెడ్డి అతిథిగా పాల్గొన్నారు. పుట్టినరోజు పార్టీలు, పిక్నిక్ లంటూ తల్లిదండ్రులే పిల్లలను చెడగొడుతున్నారని మల్లారెడ్డి అన్నారు. ప్రేమ, స్నేహం వంటివాటికి దూరంగా ఉండాలని, కొన్ని సాధించాలంటే కొన్నింటిని వదులుకోవాలన్నారు. తనంత అదృష్టవంతుడు ఎవరూ లేరన్నారు. కలలను నిజం చేసుకున్నట్లు చెప్పారు. భూమిని అమ్మి కొడుకును డాక్టర్ చదివించానని, ఆ తర్వాత తాను ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి అయ్యానన్నారు.
తమ మెడికల్ కళాశాలలో డొనేషన్ సీట్లు లేవని, అన్నీ ఆన్ లైన్ ద్వారానే అడ్మిషన్లు జరుగుతాయని, తన బంధువులు అడిగినా సీటు ఇవ్వనన్నారు. 400 మంది ఐటీ అధికారులు వచ్చి వారిపని వారు చేసుకుపోయారని, ఏమీ దొరక్కపోవడంతో నాపై నిరాధార ఆరోపణలు చేశారన్నారు. తాను క్యాసినో నడిపించడంలేదని, కాలేజీలు మాత్రమే నడిపిస్తున్నానన్నారు. తుఫాన్లు వచ్చినా తట్టుకునే ధైర్యం తనకు ఉందని, తాను అన్నీ సాధించానని, తనకు ఎలాంటి కోరికలు లేవని చెప్పారు. కష్టపడితే జీవితంలో ఎవరైనా ఎదగవచ్చని, ప్రస్తుతం తాను 33 కాలేజీలు నడిపిస్తూ ఎంతోమంది డాక్టర్లు, ఇంజనీర్లు తయారుచేస్తున్నానన్నారు. తనవద్ద ఎలాంటి బ్లాక్ మనీ లేదని మల్లారెడ్డి స్పష్టం చేశారు. మెడికల్ కాలేజీలు పెట్టిన తర్వాత వరుసగా 6 సంవత్సరాలు నష్టపోయి ఇబ్బంది పడ్డానని, వేరే పార్టీ అని అనమతివ్వలేదన్నారు. కోట్ల రూపాయలు సంపాదించినప్పటికీ ఇప్పటికీ తాను చిన్న ఇంటిలోనే నివసిస్తుంటానని, తనది చాలా సింపుల్ జీవితమని చెప్పారు.













Click it and Unblock the Notifications