పొన్నం Vs అడ్లూరి, జూబ్లీహిల్స్ పోల్ వేళ మంత్రుల రచ్చ..కొత్త మలుపు..!!
తెలంగాణ మంత్రుల వివాదం కొత్త మలుపు తిరిగింది. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ మంత్రుల వివాదం కాంగ్రెస్ కు సమస్యగా మరుతోంది. సామాజిక వర్గాల ప్రస్తావన తెర మీదకు వచ్చింది. ఈ వివాదం పైన సీఎం జోక్యం చేసుకున్నారు. సర్దిచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ సైతం మంత్రులు ఇలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వటం సరికాదని స్పష్టం చేసారు. కాగా, ఈ వివాదం పైన ఢిల్లీకి సైతం ఫిర్యాదులు చేసేందుకు సిద్దమయ్యారు. దీంతో.. మంత్రుల వివాదం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుంది.
తెలంగాణ కేబినెట్ లోని ఇద్దరు మంత్రుల వివాదం ఇప్పుడు వైరల్ అవుతోంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి పొన్నం వ్యాఖ్యలపై తాజాగా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పందించారు.

జరిగిన పొరపాటును ఒప్పుకొని క్షమాపణ చెబితే పొన్నంకు గౌరవం ఉంటుందని వ్యాఖ్యానించారు. మాదిగలు అంటే అంత చిన్న చూపా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న మాటను సమర్ధించుకొని ఇప్పటివరకు స్పందించకుండా ఉన్నావు అంటే ఈ విషయం నీ విజ్ఞతకే వదిలేస్తున్నా... పొన్నం అంటూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సహచర మంత్రిని ఆ మాట అంటే చూస్తూ ఉంటావా.. మంత్రి వివేక్ వెంకటస్వామి అని నిలదీశారు.
జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల మంత్రులు.. పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే మీడియా సమావేశానికి మంత్రి లక్ష్మణ్ ఆలస్యం అయ్యారు. దీంతో పొన్నం అసహనానికి లోనై.. పక్కనే ఉన్న మంత్రి వివేక్ చెవిలో గుసగుసలాడారు. మనకు సమయం తెలుసు..జీవితం తెలుసు..కానీ వారికేం తెలుసు ఆ దున్నపోతుగానికి అంటూ మాట్లాడారు.
ఆ సమయంలో మైక్‌లు ఆన్‌లో ఉండటంతో ఆయన మాటలు బయటకు వినిపించాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. పొన్నం వ్యాఖ్యలపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసే యోచనలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నట్లు సమాచారం. దీంతో, సీఎం రేవంత్.. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. కాగా.. ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ బై పోల్ వేళ మంత్రుల వివాదం ఇప్పుడు కాంగ్రెస్ కు సమస్యగా మారుతోంది.












Click it and Unblock the Notifications