తెలంగాణా మహిళలకు మంత్రి సీతక్క శుభవార్త.. ఆ పెద్ద వ్యాపారాలు మీకే!
తెలంగాణ రాష్ట్రంలో మహిళా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పించడానికి ఇందిర మహిళా శక్తి పథకాన్ని తీసుకువచ్చింది. ఈ క్రమంలో తాజాగా మంత్రి సీతక్క మహిళలకు మరో శుభవార్త చెప్పారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలో ఇందిర మహిళా శక్తి బజార్లో సరస్ మేళా ను ప్రారంభించిన ఆమె మహిళల ఆర్థిక పురోగతికి తీసుకుంటున్న చర్యల పైన శుభవార్త చెప్పారు.
హైటెక్ సిటీలో మహిళల సరస్ మేళా ప్రారంభించిన మంత్రి సీతక్క
మహిళా సంక్షేమానికి పూర్తిస్థాయిలో ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖమంత్రి సీతక్క పేర్కొన్నారు. ఇందిర మహిళా శక్తి పథకం ద్వారా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని ఆమె తెలిపారు. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావడం కోసం సరస్ మేళా వంటి విలువైన ప్రదర్శనలను చేస్తామని తెలిపారు. మహిళల సరస్ మేళా కోసం హైటెక్ సిటీలో స్థలాన్ని కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు 27 వేల కోట్ల రుణాలు
ప్రతి మహిళను కోటీశ్వరులుగా చేయాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళలకు భాగస్వామ్యం ఇవ్వడం తమ ప్రధాన ఉద్దేశం అన్నారు. ఇప్పటివరకు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు 27 వేల కోట్ల రుణాలను ఇచ్చినట్టు పేర్కొన్న సీతక్క తీసుకున్న రుణాలను మహిళలు 98 శాతం తిరిగి చెల్లిస్తున్నారని పేర్కొన్నారు. ఇది బ్యాంకులకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆమె అన్నారు.
పెద్ద వ్యాపారాలలో మహిళా సంఘాలు
చిన్న వ్యాపారాలతో ప్రారంభమైన మహిళా శక్తి ఇప్పుడు పెద్ద పెద్ద వ్యాపారాలలో కూడా అడుగు పెడుతోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళా సమాఖ్య నారాయణ్ పేటలో పెట్రోల్ బంకును విజయవంతంగా నిర్వహిస్తుందన్నారు. సోలార్ పవర్ ప్రాజెక్టు లతో సహా మరిన్ని వ్యాపారాలను మహిళా సంఘాలకు అప్పగిస్తామని సీతక్క తెలిపారు. హైదరాబాద్ నగరంలో మరిన్ని ప్రదేశాలను సరస్ మేళ వంటి ప్రదర్శనలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక భరోసా ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సీతక్క తెలిపారు.












Click it and Unblock the Notifications