వారిది పైశాచికానందం.. మావోయిస్టుల లేఖపై మంత్రి సీతక్క ఘాటు రిప్లై!
తెలంగాణ మంత్రి సీతక్క కు మావోయిస్టులు లేఖ రాసిన విషయం తెలిసిందే. సీతక్క కు మావోయిస్టులు రాసిన లేఖలో జీవో నెంబర్ 49 ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కులను కాలరాస్తున్న జీవో నెంబర్ 49 పైన మంత్రి సీతక్క ఎందుకు మాట్లాడడం లేదని వారు నిలదీశారు. ఆదివాసీల హక్కులను రక్షించే బాధ్యత సీతక్క మీద లేదా అంటూ ప్రశ్నించారు.
మావోయిస్టుల లేఖపై మంత్రి సీతక్క ఘాటు రిప్లై
ఈ క్రమంలో మంత్రి సీతక్క ఈరోజు మావోయిస్టులు రాసిన లేఖ పైన స్పందించారు. నేడు ములుగు జిల్లా ఏటూరునాగారంలో పర్యటించిన మంత్రి సీతక్క తన పైన మావోయిస్టులు విడుదల చేసిన లేఖ పైన అసహనం వ్యక్తం చేశారు. అసలు మావోయిస్టు పార్టీ ఇచ్చిందని చెబుతున్న లేఖ మావోయిస్టు పార్టీ ఇచ్చిందా లేదా అన్నదాని పైన కూడా క్లారిటీ లేదన్నారు.

ఆ ఆరోపణలు నిరాధారమైనవి: సీతక్క
మావోయిస్టుల లేఖ పేరుతో కొందరు తనను మహిళా అని కూడా చూడకుండా అసభ్య పదజాలం వాడుతూ రాజకీయ కక్ష తీర్చుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా బి ఆర్ ఎస్ నాయకుల తనను సోషల్ మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. మావోయిస్టుల పేరుతో చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని మంత్రి సీతక్క తెల్చి చెప్పారు.
జీవో నెంబర్ 49ని వ్యతిరేకించాను
లేఖలో తన పైన వాడిన భాష పైన ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తన మూలాలను తాను ఎన్నడూ మరిచిపోలేదు అని మాట్లాడిన సీతక్క జీవో నెంబర్ 49ను తాను వ్యతిరేకించానని గుర్తు చేశారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో జీవో నెంబర్ 49 ని వ్యతిరేకిస్తూ సమావేశం పెట్టానని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆదివాసీల జోలికి వెళ్లవద్దని అటవీశాఖ అధికారులకు సూచించానని తెలిపారు.
ఆదివాసీల జోలికి వస్తే చర్యలు తీసుకుంటాం
మంత్రి కొండా సురేఖకు కూడా ఆదివాసీల జోలికి వెళ్లదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. కొందరు రాజకీయ నాయకుల ప్రోద్బలంతో ఒకరిద్దరు అటవీశాఖ అధికారులు తప్ప మిగతా ఎవరు ఆదివాసీల జోలికి వెళ్లడం లేదని మంత్రి సీతక్క వివరణ ఇచ్చారు. ఎవరు మాట్లాడినా సరే నిజాలు మాట్లాడాలని మావోయిస్టులకు పరోక్షంగా సూచించారు మంత్రి సీతక్క. ఆదివాసీల పైన అత్యుత్సాహం ప్రదర్శించే వారి పైన చర్యలు తీసుకుంటున్నామని సీతక్క పేర్కొన్నారు.
మావోల లేఖ పేరుతో కొందరు పైశాచికానందం పొందుతున్నారు
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం ఘటనలు తమ దృష్టికి రాగానే అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తోను, ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ pccf సువర్ణ తో స్వయంగా మాట్లాడానని మంత్రి సీతక్క తెలిపారు. తమ నియోజకవర్గంలో కొంతమంది అటవీ అధికారులు ఆదివాసీల గుడిసెల మీద దాడి చేశారని తెలియగానే వారితో మాట్లాడానని, వెనక్కు పంపించానని పేర్కొన్నారు. మావోయిస్టుల లేఖను అడ్డుపెట్టుకొని కొంతమంది పైశాచిక ఆనందం పొందుతున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.












Click it and Unblock the Notifications