• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మారుతిరావు ఆస్తులపై సంచలన విషయాలు.. సగానికిపైగా శ్రవణ్‌కే.. 1200పేజీల్లో వివరాలు..

|

నల్లగొండ జిల్లా ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు మంగళవారం ప్రణయ్ హత్య కేసును విచారించింది. ఈ కేసులో మొత్తం ఎనిమిది మంది నిందితులున్నారు. వారిలో ఏ3 సుభాష్ కుమార్ శర్మ(బీహారీ కిరాయి హంతకుడు), ఏ4 అస్గర్‌అలీ(నల్గొండ), ఏ5 అబ్దుల్‌బారీ(నల్గొండ), ఏ6 అబ్దుల్ కరీం, ఏ7 సముద్రాల శివ గౌడ్ (మారుతి డ్రైవర్)ను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.

ఇక ఏ1 నిందితుడు తిరునగరి మారుతిరావు రెండ్రోజుల కిందటే అనుమానాస్పద రీతిలో చనిపోయిన విషయాన్ని కోర్టుకు తెలిపిన పోలీసులు.. సంబంధిత పోస్ట్ మార్టం రిపోర్టును కూడా సమర్పించారు. ఏ2గా ఉన్న మారుతిరావు సోదరుడు శ్రవణ్ కోర్టుకు రాలేదు. ఆస్తి వివాదం కూడా మారుతి మరణానికి కారణమై ఉండొచ్చన్న వాదనల నడుమ పోలీసులు రూపొందించిన చార్జిషీటులో పలు సంచలన విషయాలు వెల్లడయ్యాయి.

మారుతిరావు ఆస్తి 600 కోట్లు?

మారుతిరావు ఆస్తి 600 కోట్లు?

మిర్యాలగూడకు చెందిన దివంగత వ్యాపారి, ప్రణయ్ హత్య కేసులో సూత్రధారి మారుతిరావుకు కనీసం రూ.600 కోట్ల ఆస్తులున్నాయని స్థానికంగా ప్రచారంలో ఉంది. కానీ పక్కా ఆధారాలతో పోలీసులు తయారుచేసిన చార్జిషీట్ లో మాత్రం అతనికి రూ.200 కోట్ల విలువైన ఆస్తులున్నట్లు నిర్ధారణ అయింది. ఆస్తులతోపాటు మారుతిరావు ఎదిగిన తీరును కూడా చార్జిషీటులో పొందుపర్చారు. 35 ఏళ్ల కిందట కిరోసిన్ డీలర్ గా కెరీర్ మొదలుపెట్టి, ఆ తర్వాత రైస్ మిల్లు బిజినెస్ లోకి ప్రవేశించారు. 15 ఏళ్ల క్రితం రైస్ మిల్లును అమ్మేసి రియల్టర్ గా అవతారమెత్తారు. మిర్యాలగూడ చుట్టుపక్కల్లో భారీ ఎత్తున భూవిక్రయాలు జరిపారు. శరణ్య గ్రీన్ హోమ్స్ పేరుతో వందలాది విల్లాలను అమ్మినట్లు పోలీసులు తేల్చారు.

ఇవే ఆ వివరాలు..

ఇవే ఆ వివరాలు..

మొత్తం 1200 పేజీలున్న చార్జిషీటులో.. 20వ పేజీ నుంచి మారుతిరావు ఆస్తులకు సంబంధించిన వివరాలున్నాయి. రియల్ ఎస్టేట్ లో బాగా డబ్బులు సంపాదించిన మారుతిరావు.. నల్గొండ జిల్లాతోపాటు హైదరాబాద్ లోనూ విరివిగా ఆస్తులు పోగేశాడు. మిర్యాలగూడలో 100 పడకలతో అమృత హాస్పిటల్ ను నిర్మించారు. అదే ఊళ్లో భార్య గిరిజ పేరుమీద పది ఎకరాల భూమి కొనుగోలు చేశారు. మిర్యాలగూడ ఈదులగూడెం రోడ్డులో షాపింగ్ మాల్స్, తల్లిపేరు మీద మరో రెండు షాపింగ్ మాల్స్, మిర్యాలగూడ బైపాస్ రోడ్డులో 22 గుంటల భూమిని కలిగి ఉన్నారని, ఇటు హైదరాబాద్ లోని కొత్తపేట్ లో 400 గజాల ఫ్లాట్, సిటీలో వేర్వేరు చోట్ల ఐదు అపార్ట్‌మెంట్లను కూడా సొంతం చేసుకున్నారని వెల్లడైంది.

సింహభాగం శ్రవణ్‌కే..

సింహభాగం శ్రవణ్‌కే..

మారుతిరావు మరణానికి ఆస్తి తగాదాలు కూడా కారణమై ఉండొచ్చని కూతురు అమృత అనుమానాలు వ్యక్తం చేశారు. అంతలోనే మీడియా ముందుకొచ్చిన మారుతిరావు సోదరుడు శ్రవణ్.. అమృత వ్యాఖ్యల్ని ఖండించారు. ఆస్తి కోసమే అమృత డ్రామాలాడుతోందని ఆరోపించారు. అయితే చార్జిషీటులో మాత్రం మారుతిరావు తన ఆస్తిలో ఒక్కపైసా కూడా కూతురు అమృత పేరు మీద రాయలేదని వెల్లడైంది. మొత్తం ఆస్తిలో సగభాగాన్ని సోదరుడు శ్రవణ్ పేరుమీదే రాయగా, వాసవి అమృత ట్రస్టుకు మరో పావు శాతం ఆస్తిని రాసిచ్చాడు. మిగిలిన పావు భాగం మాత్రమే భార్య గిరిజకు చెందాలని మారుతిరావు వీలునామా చేయించాడు. దీనికి సంబంధించిన అధికారిక పత్రాలను కూడా పోలీసులు చార్జిషీటులో పొందుపర్చారు.

 చార్జిషీటులో ఇంకా ఏముందంటే..

చార్జిషీటులో ఇంకా ఏముందంటే..

2018 సెప్టెంబర్‌ 14వ తేదీన నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో పెరుమాళ్ల ప్రణయ్‌ హత్య కేసుకు సంబంధించి పోలీసులు మొత్తం 1200 పేజీల చార్జిషీటును రూపొందించారు. నిందితులతోపాటు 102 మంది సాక్షుల పేర్లను కూడా పేర్కొన్నారు. ప్రధానంగా ఫిర్యాదుదారు అమృత స్టేట్‌మెంట్‌ను 80 పేజీల్లో పొందుపర్చడం గమనార్హం. ప్రణయ్ తండ్రి బాలస్వామితోపాటు ఏ1 మారుతిరావు, ఏ2 శ్రవణ్ స్టేట్మెంట్లను కూడా అందులో చేర్చారు. తొమ్మిదో తరగతి నుంచే ప్రణయ్ తో పరిచయం, ఇంటర్ లో ప్రేమ, ఇంట్లో గొడవలు, పెళ్లి నుంచి చివరికి ప్రణయ్ చావు, ఆ తర్వాత కేసును వెనక్కి తీసుకోవాలంటూ మారుతిరావు బెదిరింపులు.. తదితర వివరాలన్నీ అమృత స్టేట్‌మెంట్‌లో ఉన్నాయి. మారుతిరావు కూడా..

పరువు హత్యే..

పరువు హత్యే..

దళితుడైన ప్రణయ్ ని అమృత పెళ్లిచేసుకోవడం ఇష్టంలేకే హత్య చేయించానని, కూతురు కుటుంబ పరువు తీసిందన్న కోపంతోనే ఈ పనికి పూనుకున్నానని మారుతిరావు స్వయంగా చెప్పిన విషయాలను కూడా చార్జిషీటులో పొందుపర్చారు. మారుతిరావు అనుమానాస్పద రీతిలో చనిపోవడంతో కేసు నుంచి ఆయన పేరును తొలగించి, శ్రవణ్ ను ప్రధాన ముద్దాయిగా మార్చే ప్రక్రియపై కోర్టుతో పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు.

గదిలో ఏం జరిగింది?

గదిలో ఏం జరిగింది?

మిర్యాలగూడ నుంచి శనివారం సాయంత్రం హైదరాబాద్ వచ్చిన మారుతిరావు.. ఖైరతాబాద్ లోని ఆర్యవైశ్య భవన్ రూమ్ నంబర్ 306లో బసచేసి, అనుమానాస్పద రీతిలో చనిపోయాడు. అతను ఎలుకల మందు తిని చనిపోయి ఉంటాడని సైఫాబాద్ పోలీసులు చెప్పారు. అయితే దానికి సంబంధించిన ఆధారాలు మాత్రం ఇంకా లభించలేదు. చనిపోడానికి ముందు మారుతిరావు తన లాయర్ వెంకటసుబ్బారెడ్డితో మాట్లాడారని, ప్రణయ్ కుటుంబ ఎస్సీ కాదు, క్రిస్టియన్లేనని నిరూపించడానికి విశ్వప్రయత్నాలు చేసినట్లు తెలిసింది. మారుతిరావు అనుమానాస్పద మృతిపై సైఫాబాద్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

రాజకీయ నేతల హాజరు..

రాజకీయ నేతల హాజరు..

సోమవారం మిర్యాలగూడలో మారుతిరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి. తండ్రిని చివరిచూపు చూసేందుకు వచ్చిన అమృతపై బంధువులు దాడికి యత్నించడంతో ఆమె వెనక్కెళ్లిపోయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేతోపాటు పలు పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరై, మారుతిరావుకు నివాళులు అర్పించారు. అమృతకు వ్యతిరేకంగా.. మారుతిరావు అమర్ రహే అంటూ స్మశానంలో నినాదాలు మిన్నంటాయి. ఇదిలాఉంటే, మారుతిరావుకు చెందిన షెడ్డులో లభించిన కుళ్లిపోయిన శవం ఎవరిదో పోలీసులు ఇంకా కనిపెట్టలేదు.

English summary
pranay murder case trail begins at nalgonda sc,st court on tuesday. as A1 maruti rao died in suspicious condition, police charge sheet found that maruti rao has hundreds of crores property
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X