మెట్రో రైలులో తొలి రోజు సెల్ఫీలు 45వేలు, అలా చేస్తే కెమెరాకు చిక్కుతారు
హైదరాబాద్: మెట్రో రైలులో యువత సెల్ఫీలు తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. మెట్రో రైలుతో పాటు ప్రధాని మోడీ మియాపూర్‌లో ప్రారంభించిన మెట్రో పైలాన్ కూడా సెల్ఫీ స్పాట్‌గా మారింది. మెట్రో రైలులో అయితే సెల్ఫీలతో హడావుడి చేస్తున్నారు.
కాగా, గురువారం డీజీపీ మహేందర్ రెడ్డి మెట్రో రైలు భద్రతపై మాట్లాడారు. మెట్రోరైల్ స్టేషన్‌లోకి ప్రయాణికులు అడుగుపెట్టింది మొదలు గమ్యస్థానం చేరేంతవరకూ వారి భద్రతను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అమీర్‌పేట స్టేషన్‌లో భద్రత, నిఘా ఏర్పాట్లను పరిశీలించారు.

త్వరలో ఠాణాల ఏర్పాటు
ఆ తర్వాత మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ శివానంద్ నింబర్గిలతో కలిసి మాట్లాడారు. శాంతిభద్రతల నిమిత్తం ప్రస్తుతం 600 మంది పోలీసులను మెట్రోకు కేటాయించామనీ, భవిష్యత్తులో 2,100 మంది సిబ్బంది ఉంటారని చెప్పారు. అమీర్‌పేట, పరేడ్ గ్రౌండ్స్ స్టేషన్ల వద్ద త్వరలో స్టేషన్లను ఏర్పాటు చేస్తామన్నారు.

చీమ చిటుక్కుమన్నా కెమెరాల్లో నిక్షిప్తం
మెట్రో స్టేషన్లలో అంతర్జాతీయస్థాయి తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేసినట్లు డీజీపీ తెలిపారు. చీమ చిటుక్కుమన్నా కెమెరాల్లో నిక్షిప్తమవుతుందన్నారు. మెట్రో ప్రయాణం భద్రంగా ఉండేలా రెండేళ్లు శ్రమించి, ప్రణాళికను రూపొందించినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. మాజీ అధికారి కెసిరెడ్డి, మాజీ డీజీపీ హెచ్‌జె దొర ఇందుకు సహకరించినట్లు తెలిపారు. ఈ ప్రణాళికను ప్రస్తుత హోంశాఖ సలహాదారు అనురాగ్ శర్మ అధ్యయనం చేశారనీ, కేంద్ర హోంశాఖ ఆమోదించాకే దీనిని అమలు చేస్తున్నట్లు తెలిపారు.

మొత్తం 45వేల సెల్ఫీలు
మెట్రో సేవలు మొదలైన రోజు ప్రయాణికులు మొత్తం 45,000 సెల్ఫీలను తీసుకున్నట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. అత్యధికంగా మియాపూర్ స్టేషన్‌లో 25 వేల సెల్ఫీలు తీసుకున్నట్టు నిఘా వ్యవస్థ ద్వారా తెలిసిందన్నారు. మద్యం తాగి రైలు ఎక్కేందుకు ప్రయత్నించిన వారిని ఆపామన్నారు.

స్ట్రీట్ పార్కింగ్ ప్రవేశ పెడతాం
మియాపూర్ - నాగోలు మార్గంలోని 24 స్టేషన్లలో నెలరోజుల్లోగా వాహనాలకు పార్కింగ్ వసతి కల్పిస్తామని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. రెండు మూడు రోజుల్లో పార్కింగ్ ధరలను నిర్ణయిస్తామని చెప్పారు. స్టేషన్ల సమీపంలోని ప్రభుత్వ స్థలాల్లో స్ట్రీట్ పార్కింగ్‌ను ప్రవేశపెడతామన్నారు. స్టేషన్లకు వందగజాల దూరంలో ప్రయివేటు స్థలాలు ఉంటే లీజుకు తీసుకుంటామని, ఆయా వ్యక్తులే నిర్వహిస్తామంటే ఒప్పందం కుదుర్చుకుంటామన్నారు. మెట్రో రైలు సగటు ప్రయాణికుల సంఖ్యపై రెండు, మూడు నెలలు అయితే స్పష్టత వస్తుందని ఎల్ అండ్ టీ మెట్రో ఎండీ శివానంద తెలిపారు.












Click it and Unblock the Notifications