నన్ను క్షమించండి.. దానికి చింతిస్తున్నా: చేతులు జోడించి వేడుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే
బెల్లంపల్లి: సాక్షి జర్నలిస్టు ఆంజనేయులుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్షమాపణలు చెప్పారు. మీడియా ముఖంగా ఆయన చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. నెన్నెల మండలంలో భూకబ్జాలపై ఆంజనేయులు కథనాలు రాసినందుకు ఎమ్మెల్యే ఆయన్ను దూషించారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే జర్నలిస్టుకు ఎమ్మెల్యే చిన్నయ్య క్షమాపణలు చెప్పారు.
ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పాత్రికేయ వర్గాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. దీంతో ఎట్టకేలకు ఎమ్మెల్యే దిగిరాక తప్పలేదు. బెల్లంపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన క్షమాపణలు చెప్పారు.

సాక్షి ప్రతినిధిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు తెలిపారు. మనసులో ఉన్న బాధను జర్నలిస్టులతో పంచుకునే క్రమంలో ఒకటి రెండు వ్యాఖ్యలు తప్పుగా దొర్లాయని ఆయన అన్నారు. ఆ వ్యాఖ్యలకు చింతిస్తున్నానని, ఇకపై ఇలాంటివి రిపీట్ కావని హామి ఇచ్చారు. ఎవరిని నొప్పించవద్దనేదే తన ఉద్దేశమని అందుకే క్షమాపణలు చెబుతున్నానని వెల్లడించారు.












Click it and Unblock the Notifications