
టీఆర్‌ఎస్‌లో చేరే ఉద్దేశం లేదు; బీజేపీ మాటే లేదన్న జగ్గారెడ్డి; సంగారెడ్డి ఎమ్మెల్యే రూటే సపరేటు!!
సంగారెడ్డి ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తున్నారు. పదిహేను రోజుల పాటు తన రాజీనామాకు బ్రేక్ వేసాను అని చెప్పిన జగ్గారెడ్డి, సోనియా గాంధీని, రాహుల్ గాంధీ ని కలవడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

టీఆర్ఎస్ లోకి వెళ్ళను, బీజేపీలో చేరే మాటే లేదు
పార్టీ కార్యకర్తలతో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి నిర్వహించిన సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజీనామా అంశంపై, కొత్త పార్టీలో చేరికపై ఈరోజు చర్చ లేదని, కార్యకర్తల అందరి ఆలోచన ఏంటో తనకు తెలుసునని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే ఉద్దేశం లేదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. ఇక బిజెపిలోకి వెళ్లే మాటే లేదని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఇండిపెండెంట్ గా ఉండాలని భావిస్తున్నట్లుగా జగ్గారెడ్డి పార్టీ కార్యకర్తలతో పేర్కొన్నారు. ఒకవేళ తాను కొత్త పార్టీ పెడితే తనతో ఎంతమంది వస్తారని జగ్గారెడ్డి పార్టీ కార్యకర్తలను నేతలను అడిగినట్లు సమాచారం.

కాంగ్రెస్ లోనే ఉండాలని పార్టీ కార్యకర్తలు జగ్గారెడ్డికి సూచన
అయితే జగ్గారెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాలని కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో ఉంటేనే జగ్గారెడ్డి వెంట ఉంటామని పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మధు స్పష్టం చేసినట్టుగా సమాచారం. అయితే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తో మాట్లాడిన తర్వాత రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని జగ్గారెడ్డి మీటింగ్ లో వెల్లడించినట్టు గా తెలుస్తుంది. వారితో మాట్లాడిన తర్వాత వారి నుండి సానుకూల నిర్ణయం రావాలని తాను దేవుని కోరుకుంటున్నాను అని, ఒకవేళ అలా జరగకపోతే పార్టీ నుంచి బయటకు వెళ్లిపోతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.

పార్టీ నుండి బయటకు వెళ్తే కొత్త పార్టీ పెడతా.. జగ్గారెడ్డి
తాను పార్టీని వీడి ఎందుకు వెళ్లాలనుకుంటున్నాను చాలామందికి తెలుసు అని జగ్గా రెడ్డి పేర్కొన్నారు. 2018 ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వరుసగా ఎన్నికలు వచ్చాయని, ఆ తర్వాత కరోనాతో 20 నెలల పాటు కార్యకర్తలు లేని పరిస్థితి వచ్చిందని జగ్గా రెడ్డి పేర్కొన్నారు. ఈ రెండేళ్ళు తనకు చేతనైన సహాయం చేశానని ఆయన కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. ఒకవేళ పార్టీ నుండి బయటకు వెళ్లాల్సి వస్తే కొత్త పార్టీ పెడతారని పేర్కొన్న జగ్గారెడ్డి వెల్లడించారు.

పది మంది డప్పుల వాళ్ళతో చాటింపు వేయించి జనసమీకరణ చేస్తా
తన వెంట నాయకులు రాకపోతే, పదిమంది డప్పుల వాళ్లను పట్టుకుంటానని, జగ్గారెడ్డికి ఊర్లో కార్యకర్త అంటూ ఎవరూ లేరని, జగ్గారెడ్డి వస్తుండు అని చాటింపు వేయిస్తానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు కనీసం 50 మంది అయినా తనతో పాటు రారా అంటూ జగ్గారెడ్డి ప్రశ్నించారు. జగ్గారెడ్డి వ్యాఖ్యలను బట్టి ఆయన కాంగ్రెస్ పార్టీపై తీవ్ర అసహనంతో ఉన్నట్లుగా తెలుస్తుంది. టిఆర్ఎస్, బిజెపిలోకి వెళ్లనని జగ్గారెడ్డి చెబుతున్న మాటల్ని బట్టి ఆయన నిజంగానే కొత్త పార్టీ పెడతారా అన్నది కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది.