ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూత
MLA Maganti Gopinath: భారత్ రాష్ట్ర సమితి శాసన సభ్యుడు మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 62 సంవత్సరాలు. హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారు జామున 5:45 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. తీవ్ర గుండెపోటుతో ఈ నెల 5వ తేదీన ఆయన ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి మాగంటి గోపీనాథ్ ప్రాతినిథ్యాన్ని వహించారు. ఇక్కడి నుంచి వరుసగా మూడుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ నియోజకవర్గాన్ని కంచుకోటగా మలచుకున్నారు. 1983లో టీడీపీతో ఆయన రాజకీయ ప్రస్థానం ఆరంభమైంది. 1992 వరకూ తెలుగు యువత అధ్యక్షుడిగా వ్యవహరించారు.

2014లో తెలుగుదేశం పార్టీ తరఫున తొలిసారిగా శాసన సభకు ఎన్నికయ్యారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి గుడ్ బై చెప్పారు. బీఆర్ఎస్ కడువా కప్పుకొన్నారు. ఆ తరువాత వెనుదిరిగి చూసుకునే పరిస్థితి రాలేదాయనకు. ఆ తరువాత వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయఢంకా మోగించారు.
2018 ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచారు. ఆ సమయంలో ప్రజా అంచనాల కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు. 2023లో కాంగ్రెస్ పార్టీ హవాలోనూ తనకు తిరుగు లేదని నిరూపించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ అజరుద్దీన్ ను 16 వేలకు పైగా ఓట్ల తేడాతో మట్టికరిపించారు.
తీవ్ర గుండెపోటు గురి కావడంతో ఈ నెల 5వ తేదీన ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అత్యాధునిక వైద్యాన్ని అందించినప్పటికీ డాక్టర్లు ఆయన ప్రాణాలను నిలబెట్టలేకపోయారు. ఈ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. మాగంటి మరణంతో బీఆర్ఎస్ లో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.












Click it and Unblock the Notifications