టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఛైర్మన్‌గా జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య హైదరాబాద్‌లోని బస్ భవన్‌లో బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆర్టీసీకి మూడో ఛైర్మన్‌గా ముత్తిరెడ్డి నిలిచారు.
ఈ సందర్భంగా ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో, ముత్తిరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు ఆర్టీసీ మరింత చేరువకావాలని, ప్రగతిపథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, తదితరులు పాల్గొన్నారు.

కాగా, ముత్తిరెడ్డి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్‌గా రెండు సంవత్సరాలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ గా బాజిరెడ్డి గోవర్ధన్ కొనసాగిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో తాజాగా, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు, జనగామ నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టికెట్ దక్కుతుందా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది.
జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డిని ప్రకటించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అసంతృప్తితో ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ పదవిని కట్టబెట్టినట్లు తెలుస్తోంది. మరికొందరు అసంతృప్తులకు కూడా ఇలాంటి పదవులు ఇచ్చి బుజ్జగించే పనిలో పడింది బీఆర్ఎస్.
స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు కూడా బీఆర్ఎస్ టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి కడియం శ్రీహరి పోటీలో ఉంటారని ఇప్పటికే సీఎం కేసీఆర్ విడుదల చేసిన జాబితా ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రైతుబంధు ఛైర్మన్‌గా తాటికొండ రాజయ్యను నియమించింది ప్రభుత్వం. మరోవైపు, రాష్ట్ర ఎంబీసీ ఛైర్మన్‌గా నందికంటి శ్రీధర్, మిషన్ భగీరథ వైఎస్ ఛైర్మన్‌గా ఉప్పుల వెంకటేష్ గుప్తా నియమితులయ్యారు. వీరి నియామకాలపై తెలంగాణ సర్కారు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications