ఎట్టకేలకు బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి హనుమంతరావు రాజీనామా: ఇక దారెటో?
హైదరాబాద్: రెబల్ నేతగా మారిన మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు (Mynampally Hanumantha Rao) ఎట్టకేలకు భారత రాష్ట్ర సమితి(BRS)కు రాజీనామా చేశారు. మంత్రి హరీశ్ రావుతోపాటు బీఆర్ఎస్ పార్టీపైనా విమర్శలు చేసిన హనుమంతరావు చివరకు పార్టీని వీడటంతో ఉత్కంఠకు తెరపడింది. బీఆర్ఎస్ పార్టీలో రెండు టికెట్లు ఆశించిన మైనంపల్లి భంగపడిన విషయం తెలిసిందే.
తనతోపాటు తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కూడా ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ (BRS) పార్టీ అధిష్టానానికి హనుమంతరావు కోరారు. తాను మల్కాజిగిరి నుంచి, తన కొడుకు మెదక్ నుంచి పోటీ చేస్తారని హనుమంతరావు చెప్పుకొచ్చారు. అయితే, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ మాత్రం మల్కాజిగిరి నుంచి హనుమంతరావుకు మాత్రమే టికెట్ కేటాయించారు.

ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి హనుమంతరావు రెబల్‌గా మారిపోయారు. మంత్రి హరీశ్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ మంత్రి హరీశ్‌పై మైనంపల్లి మండిపడ్డారు. అయితే, హనుమంతరావు విమర్శలను మంత్రి కేటీఆర్ ఖండించారు. తామంతా హరీశ్ వెంట ఉన్నామన్నారు. అయితే, ఆ తర్వాత ఎమ్మెల్యే టికెట్లను ఖరారు చేయగా.. మైనంపల్లి హనుమంతరావుకు మాత్రమే బీఆర్ఎస్ అధిష్టానం టికెట్ కేటాయించింది.
అయితే, తనకు పార్టీ కన్నా.. తన కుమారుడి భవిష్యత్తే ముఖ్యమని మైనంపల్లి హనుమంతరావు స్పష్టం చేశారు. తాను కేసీఆర్, కేటీఆర్.. చివరికి ఆ దేవుడ్ని కూడా లెక్క చేయనంటూ మైనంపల్లి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఓ ఆడియో కూడా బయటికి వచ్చింది. అయితే, పార్టీ, నేతలపై మైనంపల్లి విమర్శలు చేసినప్పటికీ.. బీఆర్ఎస్ అధిష్టానం మాత్రం ఆయనపై చర్యలు తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో తాజాగా, శుక్రవారం బీఆర్ఎస్ పార్టీకి మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేశారు. అయితే, ఇప్పుడు మైనంపల్లి హనుమంతరావు ఏ పార్టీలో చేరతారనేది ఉత్కంఠగా మారింది. మైనంపల్లిని స్వాగతిచేందుకు అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, మైనంపల్లి మాత్రం ఏ పార్టీలో చేరతారనేదానిపై స్పష్టమైన ప్రకటన మాత్రం చేయలేదు. అతి త్వరలోనే మైనంపల్లి రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, ఇటీవల తాము స్వతంత్ర అభ్యర్థులుగానైనా పోటీ చేస్తామని మైనంపల్లి ప్రకటించడం గమనార్హం.












Click it and Unblock the Notifications