రాజాసింగ్ కు చెక్ - బీజేపీ కీలక నిర్ణయం..!!
తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలో బీజేపీ ఎనిమిది సీట్లు విజయం సాధించింది. అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ కావటంతో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. ఇక..ఇప్పుడు బీజేపీ శాసనసభా పక్ష నేత ఎవరనే చర్చ మొదలైంది. రాజాసింగ్ కే ఆ బాధ్యతలు అప్పగిస్తారని అందరూ భావించారు. కానీ, బీజేపీ లో మాత్రం కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి.
ప్లోర్ లీడర్ ఎవరు : రాజాసింగ్ బీజేపీ శాసనసభా పక్ష నేతగా కొనసాగుతారా..లేదా ఇప్పుడు పార్టీలో ఈ చర్చ మొదలైంది. బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని గోషామహల్‌లో రాజాసింగ్ మూడోసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ నియోజకవర్గంలో ఏలేటి మహేశ్వరరెడ్డి రెండోసారి గెలుపొందారు. అయితే, ఏలేటి కొంతకాలం క్రితమే బీజేపీలో చేరారు. ఇక మిగిలిన ఆరుగురు ఎమ్మెల్మేలు మొదటిసారి అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారు. వీరిలో ముగ్గురు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి, మరో ముగ్గురు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి గెలుపొందారు.

రాజాసింగ్ కు ఛాన్స్ దక్కేనా : గత అసెంబ్లీకి 2018 ఎన్నికల్లో రాజాసింగ్ మాత్రమే బీజేపీ నుంచి గెలుపొందారు. ఉప ఎన్నికల్లో దుబ్బాక నుంచి రఘునందన్‌రావు, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్ గెలుపొందినా ఫ్లోర్ లీడర్‌గా రాజాసింగ్‌నే కొనసాగించారు. రాజాసింగ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా ఆ పదవి మరొకరికి ఇవ్వలేదు. అసెంబ్లీ కార్యకలాపాల విషయంలో అనుభవం ఉన్నవారు ఇద్దరే ఉండటంతో శాసనసభాపక్ష నేతగా ఎవరిని ఎంపిక చేస్తారనే చర్చ కమలం పార్టీలో జరుగుతోంది. రాజాసింగ్ తన నియోజకవర్గమైన గోషామహల్‌కే పరిమితం అవుతున్నారు. నిర్మల్ ఎమ్మెల్యేగా గెలిచిన మహేశ్వర్ రెడ్డినే ఫ్లోర్ లీడర్‌గా నియమించే అవకాశం ఉందంటూ పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం మహేశ్వరరెడ్డికి ఉంది.

పోటీలో మహేశ్వర రెడ్డి : రాష్ట్రంలోని సమస్యల పట్ల కూడా మహేశ్వర్ రెడ్డికి అవగాహన ఉంది. కాబట్టి ఆయనకు ఛాన్స్ ఇవ్వవచ్చని అనుకుంటున్నారు. కానీ, మూడోసారి గెలిచారు గనుక ఆయనకే ఫ్లోర్ లీడర్ బాధ్యత అప్పగించాలని కొందరు పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. కానీ, కామారెడ్డిలో అనూహ్యంగా ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌ను, కాబోయే ముఖ్యమంత్రిగా ప్రచారంలో ఉన్న రేవంత్ రెడ్డిని ఏకకాలంలో ఓడించిన కాటిపల్లి వెంకటరమణారెడ్డిని బీజేపీ శాసనసభ పక్ష నేతగా చేయాలంటూ ఒక వర్గం డిమాండ్ చేస్తోంది. కాటిపల్లి సమస్యలపై మాట్లాడగలరని, ఆయనలో పోరాటం చేసే తత్వం ఉందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దీంత, ఇప్పుడు బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎవరనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications