కలెక్టర్ వర్సెస్ ఎమ్మెల్యే: సీఎం వార్నింగ్, కలెక్టర్ కు క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే
మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ రెండు చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. ఆమె తనకు సోదరిలాంటిదని, హరితహారం కార్యక్రమంలో అనుకోకుండా ఆమెకు తన చేయి తగిలి ఉండొచ్చని అన్నారు.
హైదరాబాద్: మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతిమీనాకు ఎమ్మెల్యే శంకర్ నాయక్ రెండు చేతులు జోడించి క్షమాపణలు చెప్పారు. ఆమె తనకు సోదరిలాంటిదని, హరితహారం కార్యక్రమంలో అనుకోకుండా ఆమెకు తన చేయి తగిలి ఉండొచ్చని అన్నారు.
బుధవారం మహబూబాబాద్ జిల్లాలో జరిగిన హరితహారం మూడో విడతలో భాగంగా మొక్కలు నాటే సమయంలో కలెక్టర్‌పై ఎమ్మెల్యే శంకర్ నాయక్ అమర్యాదకరంగా ప్రవర్తించినట్టు వచ్చిన ఫొటోలు కలకలం రేపాయి.
మరోవైపు కలెక్టర్ ప్రీతిమీనా కూడా ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై పలు ఉద్యోగ సంఘాలు కూడా భగ్గుమన్నాయి. సదరు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోతే రేపు విధులకు హాజరుకాబోమంటూ కలెక్టరేట్ ఉద్యోగులు హెచ్చరించారు.
ఈ ఘటనపై సీఎం కేసీఆర్ కూడా తీవ్రంగా స్పందించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ను మందలించారు. వెంటనే కలెక్టర్ ప్రీతిమీనాకు క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యేని ఆదేశించారు. ప్రవర్తన మార్చుకోకుంటే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని కూడా హెచ్చరించారు.
అంతేకాదు, జరిగిన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేసిన సీఎం.. కలెక్టర్ ప్రీతి మీనాతో మాట్లాడి ప్రభుత్వం, పార్టీ తరపున సముదాయించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ సీతారాంనాయక్‌లకు ఆ బాధ్యతను అప్పగించారు.
కేసీఆర్ ఆదేశాల మేరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ సీతారాం నాయక్‌లు కూడా రంగంలోకి దిగి కలెక్టర్ ప్రీతిమీనాను సముదాయించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా కలెక్టర్ ప్రీతిమీనాకు క్షమాపణలు చెప్పడంతో ఇక ఈ వివాదానికి తెరపడినట్లయింది.












Click it and Unblock the Notifications