Somireddy Chandramohan Reddy: భారీ వర్షాలతో మహబూబాబాద్ లో ఇరుక్కుపోయిన ఏపీ ఎమ్మెల్యే..
గత రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తోన్నాయి. భారీ వర్షాలతో పలు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలతో రోడ్లు, రైల్వే ట్రాక్ లు దెబ్బతిన్నాయి. భారీ వర్షాల కారణంగా ఏపీకి చెందిన ఎమ్మెల్యే మహబూబాబాద్ లో ఇరుక్కుపోయారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నెల్లూరు నుంచి సికింద్రాబాద్ కు మచిలీపట్నం ఎక్స్ ప్రెస్ లో వస్తున్నారు. అయితే భారీ వర్షాల కారణంగా కేసముద్రం, నెక్కొండ మధ్యలో రైల్వే ట్రాక్ కింద మట్టి కొట్టుకుపోయింది.
దీంతో సికింద్రాబాద్, విజయవాడ మధ్య రైళ్లను నిలివేశారు. చంద్రమోహన్ రెడ్డి ప్రయాణిస్తున్న రైలును మహబూబాబాద్ రైల్వే స్టేషన్ లో నిలివేశారు. దీంతో ఆయన వెంటనే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు సమాచారం ఇచ్చారు. మహబూబాబాద్ లో స్థానికంగా ఓ నేత ఇంట్లో ఎమ్మెల్యే సోమిరెడ్డికి బస ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మహబూబాబాద్ లో రోడ్డు మార్గంలో ఆయన హైదరాబాద్ కు బయల్దేరారు.

రైల్వే ట్రాక్ దెబ్బతినడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. పలు రైళ్లను దారి మళ్లించింది. విజయవాడ-కాజీపేట మార్గంలో ట్రాక్ పైకి వరద చేరికతో 24 రైళ్లను నిలిపేశారు. సింహాద్రి, మచిలీపట్నం, గౌతమి, సంఘమిత్ర ఎక్స్‌ప్రెస్, గంగా-కావేరి, చార్మినార్, యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్ నిలిపి వేశారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. మహబూబాబాద్ జిల్లాలో రికార్డ్ స్థాయిలో అత్యధిక వర్షపాతం నమోదయింది.
మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలో 43.8 సెం.మీ రికార్డు స్థాయి వర్షపాతం కురిసింది. ఇదే జిల్లాల్లో చిన్నగూడురు మండలం 42.85, నెల్లికుదురులో 41.65, పెద్దనాగారం 40.28 సెం.మీ వర్షాపాతం పడింది. వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడలో 43.5 వర్షపాతం నమోదు అయింది. సోమవారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.












Click it and Unblock the Notifications