57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభల్లో ఎమ్మెల్సీ కవిత: ధర్మ పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు
57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభలో ఎమ్మెల్సీ కవిత ధర్మ పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేసి సాధువులను కొనియాడారు.
నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ జిల్లా నందిపేట పలుగుట్ట కేదారేశ్వర ఆలయంలో జరుగుతున్న 57వ అఖిలాంధ్ర సాధిపరిషత్ మహాసభల్లో పాల్గొన్నారు. కేదారేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం, దాదాపు 150 మంది పీఠాధిపతులు పాల్గొన్న 57వ అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభలలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ధర్మపరిరక్షణకు సాధువులు చేస్తున్న కృషి ప్రశంసనీయం అన్నారు.

ధర్నాన్ని కాపాడటంలో సాధుసంతుల గొప్పతనం ఉంది: ఎమ్మెల్సీ కవిత
కేదారేశ్వర ఆలయంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్న కవిత, 34 ఏళ్ల క్రితం సాధు పరిషత్ సభలు జరిగాయని, మళ్లీ ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలో జరగటం సంతోషంగా ఉందని ఆమె వెల్లడించారు. దేశవ్యాప్తంగా సనాతన ధర్మానికి ఎన్ని ఆటంకాలు ఎదురైనా కాపాడుకున్నందుకే భారతదేశ గొప్ప స్థాయిలో ఉందని పేర్కొన్న కవిత, ఎన్నో వితండవాదాలను ఎదుర్కొంటూ మన ధర్మాన్ని కాపాడుకుంటున్నాము అంటే అది సాధుసంతుల గొప్పతనం అని ఆమె ప్రశంసించారు.

తెలంగాణలో ధర్మరక్షణకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం
అంతేకాదు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కు ప్రత్యేకమైన చరిత్ర ఉందని పేర్కొన్న కవిత నవనాథ సాధుల పేరుపై ఏర్పడ్డ పవిత్ర ప్రాంతం నవసిద్ధుల గుట్ట అని వెల్లడించారు. తెలంగాణలో ధర్మరక్షణకు అన్ని రకాల సహాయ సహకారాలు, అండదండలు అందిస్తున్నామని పేర్కొన్న కవిత, భరతజాతిని సాధుసంతువులు ముందుకు నడిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణాలో ధర్మ పరిరక్షణకు ప్రభుత్వం ఎంతగానో పాటు పడుతుందని కవిత వెల్లడించారు. దేశంలో అందరూ సోదర భావంతో మెలుగుతూ భారతదేశాన్ని విశ్వ గురువుగా ఎదిగేలా చేయాలని కోరుతున్నానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.

150 మంది పీఠాధిపతులు ఇక్కడికి రావడం తమ అదృష్టం: ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
ఇక ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవితతో పాటుగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అఖిలాంధ్ర సాధు పరిషత్ మహాసభలు ఇక్కడ నిర్వహించడం ఆర్మూరు వాసుల అదృష్టమని ఆయన వెల్లడించారు. 150 మంది పీఠాధిపతులు ఇక్కడికి రావడం తమ అదృష్టమని పేర్కొన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మంగి రాములు మహరాజ్ నిత్యం ప్రజా సేవలో నిమగ్నమై స్థానిక ప్రజలకు ఒక దేవుడిలా మారారని వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, ఆలయాల్లో ధూపదీప నైవేద్యాలకు నిధులు ఇస్తూ ధర్మ పరిరక్షణ కోసం పాటుపడుతున్న ఏకైకరాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని ఆయన పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం ఆధ్యాత్మిక కేంద్రంగా మారుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ధర్మ పరిరక్షణ జరగాలని పీఠాధిపతులు ఆశీర్వదించాలని కోరుతున్నామని జీవన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications