ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ వేళ కీలక పరిణామం..!!
ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది.
ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో రెండో విడత విచారణ కోసం ఈ రోజు ఈడీ ముందు కవిత హాజరు కావాల్సి ఉంది. తాను విచారణకు హాజరు అవుతానని కవిత బుధవారం స్పష్టం చేసారు. కానీ, చివరి నిమిషంలో కవిత తన న్యాయవాదుల ద్వారా ఈడీకి లేఖ పంపారు. తాను ఈ రోజు విచారణకు హాజరు కాలేనని సమాచారం ఇచ్చారు. సుప్రీంకోర్టు మహిళల విచారణ సమయంలో ఎలా వ్యవహరించాలో ఇచ్చిన మార్గదర్శకాలను అందులో ప్రస్తావించారు. విచారణ సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొన్నారు. కవిత పంపిన డాక్యుమెంట్లు.. సమాచారం తీసుకున్న ఈడీ ఇప్పుడు ఎలా స్పందిస్తునేది ఉత్కంఠను పెంచుతోంది.

ఈడీ విచారణకు హాజరు కాని కవిత
కవిత ఈ రోజు ఈడీ ముందు విచారణకు హాజరవుతారని అందరూ భావించారు. ఇదే సమయంలో తనకు ఇచ్చిన సమన్లలో తాను మాత్రమే రావాలని ఎక్కడా లేని అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. దీంతో, ఈడీ కోరిన సమాచారం తమ ప్రతినిధుల ద్వారా కవిత ఈడీకి పంపారు. మహిళలను విచారణ సంస్థలు విచారించే వేళ అనుసరించాల్సిన మార్గదర్శకాల పైన సుప్రీంకోర్టు ఏం చెప్పిందో మరోసారి వివరించారు. ఇప్పటికే తాను ఇదే అంశం పైన సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసారు. ఈ కేసును సుప్రీంకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ రోజు కవిత విచారణకు హాజరైతే బుచ్చిబాబు, పిళ్లై, సిసోడియాతో కలిపి విచారించే అవకాశం ఉందని ప్రచారం సాగింది.

ప్రతినిధులతో ఈడీకి కవిత లేఖ..డాక్యుమెంట్లు
ఇక, కవిత న్యాయ నిపుణులతో సమావేశం అయ్యారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండటంతో అదే విషయాన్ని వివరిస్తూ ఈడీకి తమ ప్రతినిధుల ద్వారా లేఖ పంపారు. ఈడీ కలిసిన తరువాత కవిత ప్రతినిధులు తమ అభిప్రాయాలను స్పష్టం చేసారు. మహిళలను ఇంటి దగ్గర మాత్రమే విచారించాలనే అంశాన్ని గుర్తు చేసారు. తాము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని కవిత తరపున ఈడీని కలిసిన సోమా భారత్ వెల్లడించారు. తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. తాము డాక్యుమెంట్లు అందించామని.. ఈడీ నుంచి ఎటువంటి స్పందన లేదని చెప్పుకొచ్చారు. తాము సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే నడుచుకుంటామని వెల్లడించారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కేసులో ఎలాంటి విచారణ సరికాదని ఈడీకి రాసిన లేఖలో కవిత పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో సుప్రీం ఆదేశాలు ఇచ్చే వరకు విచారణ వాయిదా వేయాలని సూచించారు.

ఈడీ నిర్ణయంపై ఉత్కంఠ
చట్ట సభ ప్రతినిధిగా చట్టాలు చేసే తనకు చట్ట విరుద్ధంగా జరిగే అన్యాయాన్ని ప్రశ్నించడానికి తన ముందు ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటానని కవిత ఈడీకి రాసిన లేఖలో స్పష్టం చేసారు. కవిత పైన కేంద్రం కక్ష కట్టిందని సోమా భారత్ వ్యాఖ్యానించారు. తొలి విడత విచారణలో ఈడీ నిబంధనలను ఉల్లంఘించిన విషయాన్ని ప్రస్తావించారు. రాత్రి 8 గంటల వరకు కవితను ప్రశ్నించారని చెప్పారు. మహిళలను ఆరు గంటల వరకే విచారించాని సుప్రీం చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. ఈడీ తాము ఇచ్చిన సమాచారం..లేఖల పైన స్పందించలేదని.. హాజరు పైన కూడా ఏం చెప్పలదేని సోమా భారత్ స్పష్టం చేసారు. కవిత న్యాయ నిపుణులతో మంతనాలు సాగిస్తున్నారు. కవితకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. ఇక.. ఇప్పుడు కవిత పంపిన డాక్యుమెంట్లను పరిశీలించిన తరువాత ఈడీ ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుందనేది చూడాలి.












Click it and Unblock the Notifications