రేవంత్ ప్రభుత్వంపై కోమటిరెడ్డి మరో సంచలనం..!!
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు పార్టీలో రోజు రోజుకీ పెరుగుతున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేల తీరు పైన పార్టీ నాయకత్వం ఆగ్రహం గా ఉంది. మంత్రి పదవి ఆశించి భంగపడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి పరోక్ష వ్యాఖ్యలు చేసారు. తాజాగా ఈ అంశం పైన డిప్యూటీ సీఎం మల్లు భట్టి స్పందించారు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే సమయంలో పార్టీ నాయకత్వం ఆయన కు మంత్రి పదవి పైన హామీ ఇచ్చింది. కొద్ది నెలల క్రితం జరిగిన మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కలేదు. ఆ తరువాత నుంచి రాజగోపాల్ రెడ్డి తనకు ఇచ్చిన మంత్రి పదవి హామీ.. విస్మరణ గురించి ప్రస్తావన చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ పైనా పరోక్ష వ్యాఖ్యలు కొనసాగిస్తున్నారు.

మరో పదేళ్లు తానే సీఎం అంటూ రేవంత్ ఓ సమావేశంలో వ్యాఖ్యానించగా.. కాంగ్రెస్ లో ఇది కూదరదంటూ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియా జర్నలిస్ట్ లపై రేవంత్ ఫైర్ అయితే.. ఇది సరైన విధానం కాదని రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్టు చేసారు. ఇక.. తాజాగా డిప్యూటీ సీఎం భట్టి ఒక ఇంటర్వ్యూలో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పైన స్పందించారు.
https://twitter.com/rajgopalreddy_K/status/1954815604353114165దీనికి రాజగోపాల్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. "కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాకు మంత్రి పదవి ఇస్తామన్న హామీని అమలు చేయకుండా రాష్ట్ర ముఖ్య నేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్న వాస్తవాన్ని మీడియా ద్వారా ప్రజలకు వివరించిన మీకు ధన్యవాదాలు. నాకు మంత్రి పదవి ముఖ్యం కాదు. ప్రజలు తమకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కారు అమలు చేయాలని, అవినీతి రహిత పాలన అందించాలని కోరుతున్నారు.
తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని ఆశిస్తున్నాను.." అంటూ చేసిన ట్వీట్ ఇప్పుడు పార్టీ శ్రేణుల్లో వైరల్ గా మారుతోంది. అటు రాజగోపాల్ రెడ్డి తో క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి సంప్రదింపు లు చేస్తున్నారు. దీంతో.. రాజగోపాల్ రెడ్డి పైన ఎలాంటి నిర్ణయం వస్తుందనేది ఉత్కంఠగా మారుతోంది.












Click it and Unblock the Notifications