ఎమ్మెల్సీ అభ్యర్థుల ఫొటోల తారుమారు, గందరగోళం: పోలింగ్ రద్దుకు డిమాండ్
తెలంగాణలో గురువారం ఉదయం ప్రారంభమైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల పొటోలు తారుమారు అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరి ఫొటో బదులు మరొకరి ఫొటో ముద్రించారని ఓ అభ్యర్థి.
హైదరాబాద్: తెలంగాణలో గురువారం ఉదయం ప్రారంభమైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇద్దరు అభ్యర్థుల పొటోలు తారుమారు అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఒకరి ఫొటో బదులు మరొకరి ఫొటో ముద్రించారని ఓ అభ్యర్థి వర్గం ఆందోళన వ్యక్తం చేసింది.
ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్ రెడ్డి ఫొటోకు బదులు ఆ స్థానంలో ఆది లక్ష్మయ్య ఫొటో ముద్రణ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు రద్దు చేయాలంటూ ఓ వర్గం ఆందోళనకు దిగింది. కాగా, ఓటర్లు కూడా పోలింగ్ ఏజంట్లకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
హైదరాబాద్ రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ ఎన్నికల బ్యాలెట్ పేపర్‌లో మాణిక్ రెడ్డి పేరు దగ్గర లక్ష్మయ్య ఫోటో వచ్చినట్లు తెలిసింది. దీంతో ఎవరికి ఓటు వేయాలో తెలియడం లేదని ఓటర్లు వాపోయిన్లు సమాచారం. ఈ కారణంగా 2నిమిషాల పాటు పోలింగ్ ఆగిందని, ఆ తర్వాత ఏ పొరపాటు లేకుండానే పోలింగ్ కొనసాగుతుందని పోలింగ్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, పోలింగ్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం మందకోడిగా సాగుతున్న పోలింగ్.. మధ్యాహ్నం వరకు పెరిగే అవకాశం ఉంది.

ఎన్నికలు రద్దు చేయాలి: మాణిక్ రెడ్డి
బ్యాలెట్ పేపర్లలో తన ఫొటోకు బదులు మరొకరి ఫొటో పెట్టడం వల్ల పోలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని ఎమ్మెల్సీ అభ్యర్థి మాణిక్ రెడ్డి అన్నారు. మరోసారి ఎన్నికలు నిర్వహించాల్సిందేనని పట్టుబట్టారు. ఫొటోల మార్పుపై వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అక్కడి పోలింగ్ అధికారి చెబుతున్నారని అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని ఆయన కోరారు.
పోలింగ్ కొనసాగుతుంది: భన్వర్ లాల్
ఫొటోల మార్పుపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల అధికారి భన్వర్ లాల్ స్పందించారు. పోలింగ్ ఆపేది లేదని, కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపిస్తామని, తుది నిర్ణయం వారే తీసుకుంటారని చెప్పారు.
అభ్యర్థుల పేరు, వరుస సంఖ్య ప్రకారం వేసిన ఓట్లు చెల్లుబాటవుతాయని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications