బీసీల కోసం త్వరలోనే కొత్త పార్టీ.. తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు !
2028లో తెలంగాణ రాష్ట్రానికి బీసీ వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండబోతున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో పర్యటించిన ఆయన అక్కడ ఏర్పాటు చేసిన బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి త్వరలోనే బీసీ పార్టీ రాబోతుందని చెప్పారు. అగ్రవర్ణ పార్టీలు బీసీలకు ఎప్పటికైనా కిరాయి ఇండ్లేనని అన్నారు. మిగిలిన పార్టీలకు ఉన్నట్లే త్వరలోనే బీసీలకు కూడా ఓ గుర్తు రాబోతుందని తెలిపారు. అప్పుడు తమ బీసీ ఓట్లు బీసీలకేనని స్పష్టం చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ..
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ జేఏసీ పోటీ చేయబోతుందని.. బీసీలంతా ఏకతాటిపైకి వచ్చి గెలిపించుకోవాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ బిడ్డల చేయిపట్టుకుని తెలంగాణలో బీసీలం అధికారంలోకి రాబోతున్నామని చెప్పారు. బీసీ లను ఇన్నాళ్లు మోసం చేసిన అగ్రవర్ణ పార్టీలను.. గోల్కొండ కోట వరకు దేకియ్యకపోతే తన పేరు తీన్మార్ మల్లన్న కాదని సవాల్ విసిరారు.

తీన్మార్ మల్లన్న ఒంటరి కాదని మల్లన్న వెనుక గ్రామ గ్రామాల బీసీ బిడ్డల అండ ఉందన్నారు. ఈ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ బిడ్డలను వేలివేసిన గ్రామాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ముదిరాజులు బీసీ ఉద్యమానికి పెద్దన్నపాత్ర వహించాలన్నారు. రాష్ట్రంలో బీసీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక.. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకువచ్చి ప్రతి బీసీ ఇంటికి రెండెకరాల భూమి పట్టా పత్రాన్ని అందివ్వబోతున్నామని ప్రకటించారు.
కవితకు ఏం సంబంధం..
బీసీల రిజర్వేషన్లకు జాగృతి అధ్యక్షురాలు కవితకు ఏం సంబంధం అని తీన్మార్ మల్లన్న ప్రశ్నించారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రభుత్వం ఆర్డినెన్స్ ఇస్తామంటే కవిత రంగులు పూసుకుని సంబరాలు చేసుకుంటోందని మండిపడ్డారు. ఆమె తీరు దున్నపోతు ఈనితే దుడ్డెను కట్టేసినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కవిత తీరు చూసిన వాళ్లంతా నవ్వుకుంటున్నారన్నారు.
ఈ సందర్భంగా సభకు హాజరైన వారితో తీన్మార్ మల్లన్న ప్రమాణం చేయించడం హాట్ టాపిక్ గా మారింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నిలబడితే బీసీ అభ్యర్థికి తప్ప మరో అభ్యర్థికి ఓటు వేయనని వారితో ప్రమాణం చేయించారు.












Click it and Unblock the Notifications