హైదరాబాద్ మళ్లీ వర్షం, కూల్‌గా సిటీ: మరో మూడ్రోజులపాటు తెలంగాణలో వానలు
హైదరాబాద్: నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం వరకు భానుడి భగభగలతో అల్లాడిన భాగ్యనగరం అకస్మాత్తుగా చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. ఫిల్మ్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట, కూకట్‌పల్లి, బాలానగర్ తదితర ప్రాంతాల్లో భారీ జోరువాన కురిసింది.
కొన్ని ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ సరఫరా నిలిచింది. రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ స్తంభించి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత కొద్దిరోజులుగా ఎండ వేడి, ఉక్కపోతతో అల్లాడుతున్న జనం వర్షం కారణంగా కాస్త ఉపశమనం పొందారు.

ఇది ఇలావుండగా, రానున్న మూడు రోజులపాటు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు ఎండవేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగిస్తున్నప్పటికీ.. ధాన్యం విక్రయించేందుకు సిద్ధమైన రైతులకు మాత్రం ఆవేదననే మిగుల్చుతోంది. ధాన్యం తడవడంతో కొనుగోలు చేయడం లేదని వాపోతున్నారు.
కాగా, పగటిపూట ఉష్ణోగ్రతలు 39 నుంచి 42 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో పగలు గరిష్టంగా 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. గురు, శుక్రవారాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.

మరోవైపు, నైరుతి రుతుపవనాలు జూన్ 7 నుంచి జూన్ 11 మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉందని.. భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేసింది. జూన్ నెలాఖరు నుంచి రాష్ట్రంలో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చనున్నాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం జూన్ 7 నుంచి 11 వరకు రుతుపవనాలు తెలంగాణను తాకుతాయి. రుతుపవనాల రాకతో మొదట్లో వర్షాలు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంది.












Click it and Unblock the Notifications