ఇద్దరూ కలిసి ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో?
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షా ఇద్దరూ కలిసి ఈ దేశాన్ని ఏవిధంగా నాశనం చేయాలనుకుంటున్నారో అర్థం కావడంలేదని, ప్రజాస్వామ్య వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారంటూ తెలంగాణ పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మండిపడ్డారు. ఆదర్శ్‌నగర్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్ట ర్స్ లో మీడియాతో మాట్లాడిన తలసాని మోడీ, షాపై నిప్పులు చెరిగారు.
అసలు ఈ దేశాన్ని ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావడంలేదని, స్థానిక ప్రభుత్వాలు ఉండటం వారికి ఇష్టం లేదని, చీలికలు తెచ్చి సర్వనాశనం చేయాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మహారాష్ట్రలో సంక్షోభం ఏర్పడటం.. గవర్నర్‌కు కరోనా సోకి ఆస్పత్రిలో చేరడం.. గోవా గవర్నర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించడం గమనిస్తుంటే కచ్చితంగా ఏదో కుట్ర జరుగుతున్నట్లు అర్థమవుతోందన్నారు.

తెల్లవారిన దగ్గర నుంచి సంప్రదాయాలు, సంస్కృతి గురించి మాట్లాడే మోడీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మధ్యప్రదేశ్, కర్ణాటక, గోవా, అరుణాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు సాధించి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పార్టీలో చీలికలు తెచ్చి వ్యవస్థలను సర్వనాశనం చేస్తోందని ధ్వజమెత్తారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకుంటోందని మండిపడ్డారు.
రోజులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవని, బీజేపీ ఎల్లకాలం అధికారంలో ఉండదని, మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలవల్ల ప్రపంచం ముందు భారత్ తలదించుకునే పరిస్థితి వచ్చిందన్నారు.