మునుగోడు ఓటర్ల జాబితా సవరణ.. హైకోర్టులో విచారణ; ధర్మాసనం చెప్పిందిదే!!
తెలంగాణ రాష్ట్రంలో మునుగోడు ఉప ఎన్నికల పోరు కొనసాగుతోంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో మునుగోడు ఓటర్ల జాబితా పై గందరగోళం నెలకొంది. మునుగోడు లో కొత్త ఓటర్ల జాబితా పై అనుమానం వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయగా, బిజెపి కోర్టు మెట్లెక్కింది. ఇక దీనిపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఏడు విచారణలో కీలక విషయాలను వెల్లడించింది.

కొత్త ఓటర్ల నమోదుపై కోర్టు మెట్లెక్కిన బీజేపీ
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కొత్త ఓటర్లుగా నమోదు చేసుకోవడం కోసం దాదాపు 25 వేల మంది ఓటర్లు దరఖాస్తులు చేసుకున్నారు. అయితే మునుగోడు ఉప ఎన్నికలకు ఎక్కువగా బోగస్ ఓటర్లు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో బిజెపి రిట్ పిటిషన్ దాఖలు చేసి ఉప ఎన్నికకు జూలై 31వ తేదీ వరకు ఉన్న జాబితానే ఓటర్ల జాబితాలో పరిగణించాలని కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది. ఈ మేరకు ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని బిజెపి తన రిట్ పిటిషన్లో కోరింది. అతి తక్కువ సమయంలో మునుగోడులో 25 వేల ఓటర్ల దరఖాస్తులు వచ్చాయని, ఫామ్ 6 కింద వచ్చిన దరఖాస్తులలో తప్పుడు ఓటర్లు ఉన్నారని బిజెపి ఆరోపించింది.

ఓటర్ల జాబితా వివరాలను పరిశీలించిన ధర్మాసనం
ఇక దీనిపై విచారణ చేసిన హైకోర్టు ధర్మాసనం ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించింది. ఓటర్ల జాబితా సవరణ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కోర్టుకు సమర్పించిన డేటాని హైకోర్టు ధర్మాసనం పరిశీలించింది. 2018 అక్టోబర్ 12వ తేదీన మునుగోడు ఓటర్లు 2,14,847 మంది ఉన్నట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈనెల 11వ తేదీ నాటికి మునుగోడు ఓటర్లు 2,38,759 మంది ఉన్నారని పేర్కొన్నారు. 25 వేల 13 మంది ఓటర్లు కొత్త ఓటర్లుగా దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు 12,249 మంది కొత్త ఓటర్లు అనుమతించామని కోర్టుకు తెలియజేశారు. 7,247 మందిని తిరస్కరించామని సీఈఓ చెప్పారు. ఇక మిగతా ఓటర్ల జాబితా పెండింగ్లో ఉందని, నేటితో ఓటరు జాబితా సవరణ పూర్తి చేస్తామని వివరించారు.

మళ్ళీ విచారణ అక్టోబర్ 21 కి వాయిదా
దీంతో మునుగోడులో ఓటర్లు అసాధారణంగా పెరిగినట్టు కనిపించడం లేదని అభిప్రాయపడిన ధర్మాసనం, జాబితా ప్రకటించిన తర్వాత అభ్యంతరాలుంటే తెలుపవచ్చు అని వెల్లడించింది. ఇదే సమయంలో పెండింగ్లో ఉన్న ఓటరు జాబితాను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications