ఇక్కడ కార్డులు క్లోన్ చేసి, ముంబైలో డ్రా చేశారు
హైదరాబాద్: సికింద్రాబాద్ సిండికేట్ బ్యాంక్ వద్ద ఖాతాదారులు శనివారం ఆందోళనకు దిగారు. పికెట్ బ్రాంచ్‌లో తమ ఖాతాల నుంచి డబ్బు డెబిట్ కార్డుల ద్వారా డెబిట్ అయినట్లు తెలుసుకుని వారు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఖాతాదారుల ప్రమేయం లేకుండానే డబ్బులు డ్రా అవడంతో కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేశారు.
తాము ఎక్కడా కార్డును ఉపయోగించలేదని, ఇంట్లో ఉన్న సమయంలో డబ్బు విత్‌డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయని బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. తమ ప్రమేయం లేకుండా డబ్బులు మాయం అవడంపై బ్యాంకు సిబ్బందిని వారు నిలిదీశారు. బ్యాంక్ ఉద్యోగులు సరిగ్గా సమాధానం చెప్పకపోవడంతో ఖాతాదారులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన బ్యాంకు అధికారులు సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు.

22 ఖాతాల నుంచి సుమారు రూ.15 లక్షలకు పైగా డబ్బులు డ్రా అయినట్లు గుర్తించారు. ముంబైలోని ఏటీఎంల ద్వారా ఎక్కువ శాతం డబ్బు విత్‌డ్రా అయినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. క్లోనింగ్ కార్డుల ద్వారా రాత్రికి రాత్రే రూ. లక్షల డబ్బు డ్రా అవడంపై అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఖాతాదారులు వెంటనే తమ కార్డులను మార్చుకోవాలని అధికారులు సూచించారు.
దీనిపై స్పందించిన బ్యాంకు అధికారులు ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టి కార్డుల ద్వారా అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని ఖాతాదారులకు హామీ ఇచ్చారు. ముంబైలోని ఏటీఎంల ద్వారా అకౌంట్ల విత్ డ్రా అయినట్లు గుర్తించారు.












Click it and Unblock the Notifications