దమ్ముంటే మళ్లీ నాపై పోటీ చెయ్; ఎమ్మెల్సీ కవితకు ఎంపీ అరవింద్ సవాల్
టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. నిన్నటికి నిన్న ఎమ్మెల్సీ కవిత ఎంపీ అరవింద్ ను టార్గెట్ చేసి విమర్శించారు. ఉచిత సలహాలు ఇవ్వటం పనిగా పెట్టుకొని ధర్మపురి అరవింద్ టైం పాస్ చేస్తూ పసుపు రైతులను మభ్యపెడుతున్నారంటూ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. బాండ్ పేపర్ రాసి మోసం చేసింది కాక, కనీసం రైతులను ఆదుకోవడం లేదని ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డదారిలో గెలిచి కాలక్షేపం చేస్తున్నారని మండిపడిన కవిత ఎంపీ ఆటలు ఇక ముందు సాగనివ్వబోమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ధర్మపురి అరవింద్ రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కవితకు దమ్ముంటే మళ్లీ తనపై పోటీ చేయాలంటూ ధర్మపురి అరవింద్ సవాల్ విసిరారు. ఓటమి మత్తు దిగడంతో కవిత మూడేళ్ల తర్వాత బయటకు వచ్చి ఇప్పుడు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు అంటూ మండిపడ్డారు. తనపై రాజకీయ పోరాటం చేయడానికి కవిత సిద్ధంగా ఉండాలని పేర్కొన్న ధర్మపురి అరవింద్, పసుపు బోర్డుపై పసుపు రైతుల సమక్షంలో కవితతో చర్చకు సిద్ధంగా ఉన్నామంటూ పేర్కొన్నారు.

ధైర్యముంటే సెక్యూరిటీని పక్కనపెట్టి కవిత చర్చకు రావాలని సవాల్ విసిరారు. తండ్రి, అన్న మాదిరిగా కవిత కూడా చిల్లర రాజకీయాలు మాట్లాడుతున్నారని ధర్మపురి అరవింద్ నిప్పులు చెరిగారు. ధైర్యముంటే సెక్యూరిటీని పక్కనపెట్టి కవిత చర్చకు రావాలని పేర్కొన్న ధర్మపురి అరవింద్ మహిళ కాబట్టి బతికిపోతుంది అంటూ పేర్కొన్నారు. పసుపు రైతుల చేతిలో కవితకు పరాభవం తప్పదని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. కవిత చెప్పే మాటలు వింటే రైతులు ఆత్మహత్య చేసుకుంటారు అంటూ అరవింద్ పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 80 సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని ఎంపీ ధర్మపురి అరవింద్ స్పష్టం చేశారు. టిఆర్ఎస్ ను ఓడించటం బిజెపి లక్ష్యమని చెప్పిన ఆయన, టిఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కి వేయడానికి జేపీ నడ్డా పర్యటన కొనసాగుతుందని ధర్మపురి అరవింద్ తెలిపారు. గులాబీలకు, పింకీ లకు సమాధానం చెప్పాల్సిన అవసరం తనకు లేదని పేర్కొన్న ధర్మపురి అరవింద్ తాను ప్రజలకు మాత్రమే జవాబుదారీ అంటూ వెల్లడించారు.












Click it and Unblock the Notifications