మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం..
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ మరోసారి తనకు తిరుగులేదని నిరూపించుకుంది. 110 మున్సిపల్ ఛైర్మన్ స్థానాలను కైవసం చేసుకుని ప్రత్యర్థులకు అందనంత ఎత్తులో నిలబడింది. అయితే అక్కడక్కడా పార్టీలోనూ అసంతృప్తి స్వరాలు వినిపిస్తున్నాయి. మున్సిపల్ ఛైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకుని.. చివరి నిమిషంలో పదవి దక్కనివారు కాస్త అసంతృప్తిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో సూర్యాపేటలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపుతోంది.

టీఆర్ఎస్ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
సూర్యాపేట టీఆర్ఎస్‌కు చెందిన కార్యకర్త ఒకరు ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు. పట్టణంలోని ఐదో వార్డు నుంచి గెలుపొందిన బాషా భాయ్ అనే నేతకు మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవి దక్కకపోవడంతో అతను ఆత్మహత్యకు యత్నించాడు. బాషా భాయ్‌కే పదవి దక్కుతుందని భావించినప్పటికీ.. చివరి నిమిషంలో పదవి వేరే నేతను వరించింది. దీంతో తమ నాయకుడికి పదవి దక్కలేదన్న కారణంతో ఆయన అనుచరుడైన యువకుడు ఒకరు ఆత్మహత్యకు యత్నించారు. కార్యకర్త ఆత్మహత్యతో సూర్యాపేటలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆత్మహత్యకు యత్నించిన యువకుడిని హుటాహుటిని ఆస్పత్రికి తరలించారు.

సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్‌గా అన్నపూర్ణమ్మ..
సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్‌గా దళిత సామాజికవర్గానికి చెందిన అన్నపూర్ణమ్మ ఎన్నికయ్యారు. దళిత సామాజికవర్గానికి చెందిన తనను గుర్తించి పదవి ఇచ్చినందుకు అన్నపూర్ణమ్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆ సమయంలో భావోద్వేగానికి గురైన అన్నపూర్ణమ్మ కంటతడి కూడా పెట్టుకున్నారు. సూర్యాపేట మున్సిపల్ ఛైర్మన్ పదవిని దళిత సామాజికవర్గానికి చెందిన నేతకు కేటాయించడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రులు కేటీఆర్,జగదీష్ రెడ్డి చిత్రపటాలకు పాలాభిషేకం కూడా చేశారు.

నేరేడుచర్ల టీఆర్ఎస్ కైవసం
ఇక రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన నేరెడుచర్ల మున్సిపాలిటీ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది.ఏడుగురు కౌన్సిల్ సభ్యులు, నలుగురు ఎక్స్ అఫీషియో ఓట్లతో టీఆర్‌ఎస్ నేరేడుచర్ల మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే చివరి నిమిషంలో ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డికి ఎక్స్‌అఫీషియో ఓటు కల్పించారని కాంగ్రెస్ అభ్యంతరం తెలిపింది. ఓటింగ్ ప్రారంభమయ్యాక ఓటు హక్కు కల్పించడమేంటని మండిపడింది. ఛైర్మన్ ఎన్నికకు వ్యతిరేకంగా నేరేడుచర్ల సెంటర్‌లో ఉత్తమ్ రోడ్డుపై ధర్నాకు కూడా దిగారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి మిర్యాలగూడకు తరలించారు.

మొత్తం 110 స్థానాల్లో టీఆర్ఎస్..
రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన మొత్తం 120 మున్సిపాలిటీల్లో 110 స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఇక 9 కార్పోరేషన్లకు జరిగిన ఎన్నికల్లో తొమ్మిదింటినీ టీఆర్ఎసే కైవసం చేసుకుంది. కాంగ్రెస్ ఏడు చోట్ల మెజారిటీ సాధించినా కేవలం రెండు చోట్ల మాత్రమే మున్సిపల్ ఛైర్మన్ పదవిని దక్కించుకోగలిగింది. ఇక బీజేపీ కూడా రెండు చోట్ల మాత్రమే మున్సిపల్ ఛైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది.












Click it and Unblock the Notifications