Municipal Elections: రేవంత్ vsకేసీఆర్, ఆట మొదలు - ముహూర్తం ఫిక్స్..!!
Municipal Elections in Telangana: తెలంగాణలో మరో ఎన్నికల సమరానికి ముహూర్తం ఫిక్స్ అయింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు తుది కసరత్తు జరుగుతోంది. పోలింగ్ తేదీల పైన దాదాపు క్లారిటీ వచ్చింది. రాజకీయంగా ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఇప్పటికే సీఎం రేవంత్ తన కేబినెట్ మంత్రులకు ఈ ఎన్నికల కోసం బాధ్యతలు అప్పగించారు. అటు బీఆర్ఎస్.. బీజేపీ సైతం కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. దీంతో.. రాజకీయం నువ్వా నేనా అన్నట్లుగా మారింది.
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్దం అవుతోంది. ఈ నెల 27న మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఫిబ్రవరి 11 లేదా 12వ తేదీల్లో పోలింగ్ దిశగా ముహూర్తం ప్రకటించేందుకు తుది కసరత్తు జరుగుతోంది. ఈ మేరకు ఎన్నికల సంఘం సన్నాహా లు చేస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో 116 మునిసిపాలిటీలకు, 7 కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. 2,996 వార్డుల పరిధిలో 52,43,023 మంది ఓటర్లున్నారు.

వీరిలో మహిళలు 26,80,014 మంది ఉండగా, 25,62,369 మంది పురుషులు, 640 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. పోలింగ్ కేంద్రాలవారీగా ఓటర్ల జాబితాను అధికారులు ఇప్పటికే ప్రచురించారు. ఎస్‌ఈసీ రాణికుముదిని ఎన్నికల ఏర్పాట్లు, సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లతో వరుసగా వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. దీంతో.. రాజకీయంగ పార్టీలు సైతం తమ వ్యూహాలను సిద్దం చేస్తున్నాయి.
ఇక సమరమే
ఇక.. రాజకీయంగా ఈ ఎన్నికలు అధికార కాంగ్రెస్ తో పాటుగా బీఆర్ఎస్, బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ ఇప్పటికే జిల్లాల పర్యటనలు చేస్తున్నారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించింది. కేటీఆర్ వరస పర్యటనలకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచంద్రరావు జిల్లాల్లో కేడర్ తో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మున్సిపల్ ఎన్నికల పైన పార్టీ నేతలకు స్పష్టత ఇచ్చారు.
ఇక.. 27న ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో మొదలయ్యే అవకాశం ఉంది. సీఎం రేవంత్ తన మంత్రులకు జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికల తరువాత జెడ్పీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉండటంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు జరగనుండటంతో... ముఖ్యమంత్రి ఈ మేర పార్టీ నేతలను సమాయత్తం చేస్తున్నారు. కేసీఆర్ సైతం ఈ ఎన్నికల పైన పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications