టీఆర్ఎస్ కు బూరా నర్సయ్య గౌడ్ షాక్ - బీజేపీ గూటికి మాజీ ఎంపీ..!!
మునుగోడు ఎన్నికల వేళ అధికార టీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ప్రకటించి.. మునుగోడు ఎన్నికల్లో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్న గులాబీ పార్టీకి అదే జిల్లా నుంచి మాజీ ఎంపీ జంప్ అయ్యారు. మునుగోడు ఉప ఎన్నికల్లో నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ సీటు ఆశించారు. బీసీ ఓటింగ్ ఎక్కువగా ఉండటంతో, తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన పార్టీ నేతలను కోరారు. కానీ, గతంలో పోటీ చేసి ఓడిన మాజీ ఎమ్ముల్యే కూసుకుంట్ల ప్రభాకర రెడ్డికి సీఎం కేసీఆర్ సీటు ఖరారు చేసారు. దీంతో...బూరా నర్సయ్య గౌడ్ రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అనుమానం రాజకీయంగా మొదలైంది.
ఆశావాహులను బుజ్జగించే క్రమంలో భాగంగా మాజీ ఎంపీ బూరా నర్సయ్య గౌడ్ తో పాటుగా.. కర్నే ప్రభాకర్ తో సీఎం కేసీఆర్ చర్చలు చేసారు. బీఆర్ఎస్ ప్రకటనతో జాతీయ పార్టీలో బూరా నర్సయ్య గౌడ్ సేవలు వినియోగించు కుంటామని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీంతో.. ఏకీభవించిన నర్సయ్య గౌడ్.. గురువారం టీఆర్ఎస్ అభ్యర్ధి నామినేషన్ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు. కానీ, సడన్ గా ఈ రోజు తన నిర్ణయం మార్చుకున్నారు. బూరా నర్సయ్య గౌడ్ ఢిల్లీ వెళ్లారు. బండి సంజయ్ సూచన మేరకే హస్తినకు చేరుకున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమక్షంలో బూరా నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరుతారని విశ్వసనీయ సమాచారం. 2014 ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ భువనగిరి నుంచి టీఆర్ఎస్ ఎంపీగా గెలుపొందారు.

2019 ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో బూరా నర్సయ్య గౌడ్ ఓడిపోయారు. మునుగోడు ఇదే పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. జిల్లా మంత్రి జగదీశ్వర రెడ్డితో పలు మార్లు మునుగోడు ఉప ఎన్నికల్లో సీటు గురించి బూరా నర్సయ్య గౌడ్ చర్చించారు. బీసీల ఓట్ బ్యాంక్ ను పరిగణలోకి తీసుకొని అవకాశం ఇవ్వాలని కోరారు. కానీ, తాజాగా తిరిగి ప్రభాకర రెడ్డికి టికెట్ ఇవ్వటంతో నర్సయ్య గౌడ్ తో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లారు. వారితో చర్చల తరువాత బూరా నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు మునుగోడు ఎన్నికల వేళ..బూరా నర్సయ్య గౌడ్ నిర్ణయం ఏ మేర ప్రభావం పడుతుందనేది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications