మూసీ నది సుందరీకరణ ప్రాజెక్ట్ లో కీలక ముందడుగు
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది ప్రక్షాళన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. మూసీ నది సుందరీకరణ, అభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా 734.07 భూమిని మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(MRDCL) కు బదలాయించేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ నిర్ణయంతో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్(MRDP) పనులు మరింత వేగవంతం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బదలాయించే భూములు రంగారెడ్డి జిల్లాలోని నాలుగు మండలాల్లో విస్తరించి ఉన్నాయి.
హిమాయత్ సాగర్ లోని ఈసా నది వద్ద, గండిపేట మండలంలోని కిస్మత్ పూర్, రాజేంద్రనగర్ మండలంలోని ప్రేమావతి నగర్, బడ్వేల్, శంషాబాద్ మండలంలోని కొత్వాల్ గూడలో హెచ్ ఎండీ ఏ లే అవుట్ ల కోసం కేటాయించిన ఈ భూములను బదలాయించారు. మూసీ నది సుందరీకరణతోపాటు రివర్ ఫ్రంట్ కారిడార్ అభివృద్దిని చేపట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలో మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) కు 734.07 ఎకరాల భూమిని బదలాయిస్తూ భూపరిపాలన ప్రధాన కమిషనర్ లోకేశ్ కుమార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే పలు ప్రభుత్వ రంగ సంస్థలకు కేటాయించిన భూములను సైతం మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (MRDCL) కు బదలాయించారు. టీఈఈఆర్ ఎల్(129.39 ఎకరాలు), ఐఐపీహెచ్(41.27ఎకరాలు), వాలంతరి(219.09 ఎకరాలు) వంటి సంస్థలకు కేటాయించిన భూములతో పాటు, శంషాబాద్ మండలం కొత్వాల్ గూడలో హెచ్‌ఎండీఏ లేఅవుట్ కోసం కేటాయించిన భూమిని కూడా మూసీ ప్రాజెక్టు కోసం బదలాయించారు. ఇక భూములు కోల్పోయిన సంస్థలకు ఫ్యూచర్ సిటీ, శంషాబాద్ మండలంలో ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇక మూసీ సుందరీకరణ, అభివృద్ధి కోసం ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ (ఏడీబీ) నుంచి రూ. 4,100 కోట్ల రుణం పొందేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించిన విషయం తెలిసిందే. ఇక మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్(MRDP) లో భాగంగా మూసీ నదిలో పేరుకుపోయిన చెత్తను తీసి పూడికలు తీసి శుభ్రం చేయడం.. మూసీ నదికి రెండు వైపులా 110 కిలోమీటర్లు మేర అభివృద్ధి చేస్తారు. అలాగే ప్రాజెక్ట్ లో భాగంగా నదికి రెండు వైపులా రోడ్లు, సైకిల్ ట్రాక్ లు, వాకింగ్ వే లు, పార్కులు, పచ్చని ప్రదేశాలను ఏర్పాటు చేయనుంది.












Click it and Unblock the Notifications