ఏపీలోకి కేసీఆర్ బీఆర్ఎస్ ఎందుకంటే..?: జనసేన వెనక్కి తగ్గదన్న నాదెండ్ల
విశాఖపట్నం: ఏపీలో అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీతోపాటు కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్. విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. చీకటి జీవోలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని వైసీపీ ప్రభుత్వం చూస్తోందని మండిపడ్డారు.

జనసేన వెనక్కి తగ్గదన్న నాదెండ్ల మనోహర్
ప్రజా సమస్యలపై గళం విప్పే విషయంలో జనసేన వెనక్కి తగ్దదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. విపక్షాలు ప్రజలకు చేరువ కావడంతో సీఎంకు భయం పట్టుకుందన్నారు. అభద్రతా భావంతోనే నిరంకుశ జీవోలు తెస్తున్నారని మండిపడ్డారు. ప్రతి కార్యక్రమానికి సీఎం అనుమతి కావాలా? అని ప్రశ్నించారు. జనసేన ఏ కార్యక్రమం చేసినా చట్ట ప్రకారమే చేస్తుందన్నారు నాదెండ్ల మనోహర్. ప్రతిపక్ష పార్టీలుగా ప్రజా సమస్యలపై గళం విప్పే బాధ్యత తమకుందన్నారు. ఆ విషయంలో వెనక్కి తగ్గమన్నారు.

పవన్ కళ్యాణ్‌ను ఎందుకు అడ్డుకుంటున్నారన్న నాదెండ్ల
ఎన్ని జీవోలు తెచ్చినా.. ఎన్ని ఒత్తిడిలు తీసుకొచ్చినా.. చట్టాలను గౌరవిస్తామన్నారు. ప్రజల్నీ గౌరవిస్తామని చెప్పారు. ప్రజల తరపున గొంతు వినిపించడం తమ బాధ్యతగా ముందుకెళ్తామని తేల్చి చెప్పారు. జగన్ సభలకు జనం రాకపోతే పింఛన్లు తీసేస్తామని బెదిరిస్తున్నారని నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు పవన్ కళ్యాణ్ రూ. లక్ష ఆర్థిక సాయం చేస్తుంటే.. ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. సభలపై ఆంక్షలెందుకని ప్రశ్నించారు.

జగన్‌కు మేలు చేసేందుకే ఏపీలోకి బీఆర్ఎస్ అంటూ నాదెండ్ల
బీఆర్ఎస్‌పైనా నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పార్టీతో ఏపీకి ఏం మేలు జరుగుతుందని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ రెడ్డి సహకారం అందించి.. జనసేన పార్టీకి వచ్చే ఓట్లు చీల్చేందుకే కేసీఆర్.. బీఆర్ఎస్ ముసుగులో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. సీఎం జగన్.. తెలంగాణకు ఏపీ ఆస్తులు ఇచ్చి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. బంగారు ఆంధ్ర కోసం కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. కాగా, సంక్రాంతి తర్వాత కేసీఆర్ ఏపీలో బహిరంగ సభ ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏపీకి బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ను నియమించిన విషయం తెలిసిందే. తోట మాజీ జనసేన పార్టీ నేత కావడం గమనార్హం.












Click it and Unblock the Notifications