చంద్రబాబు ప్లాన్: నారా లోకేష్‌ను పక్కకు తప్పించారా?
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై తీవ్రమైన ప్రభావమే చూపినట్లున్నాయి. తెలుగుదేశం తెలంగాణ బాధ్యతల నుంచి ఆయనను చంద్రబాబు పక్కకు తప్పించినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
శాసనసభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రకాష్ గౌడ్, రాజేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరిన నేపథ్యంలో జరిగిన తెలంగాణ టిడిపి నాయకుల సమావేశాలకు కూడా నారా లోకేష్ హాజరు కాలేదని తెలుస్తోంది. నారా లోకేష్‌ను తెలంగాణ పార్టీ వ్యవహారాల నుంచి తప్పించినట్లు చంద్రబాబు చెప్పకనే చెప్పారని అంటున్నారు.
ఎల్ రమణ, రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేయాలని టిడిపి వర్గాలకు చంద్రబాబు చెప్పారు. దీంతో నారా లోకేష్ ఇక తెలంగాణ వ్యవహారాలకు దూరంగా ఉంటారని ఆయన సూచించారని అంటున్నారు. నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో చంద్రబాబు ఆ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెలంగాణ మంత్రి, తెరాస నాయకుడు కెటి రామారావుతో నారా లోకేష్ పోటీ పడి ప్రచారం సాగించారు. సెటిలర్ల ఓట్లన్నీ తమకే వస్తాయనే ధీమాతో చంద్రబాబు ఉండడం వల్లనే నారా లోకేష్‌ను పూర్తి స్థాయిలో రంగంలోకి దించారని అంటున్నారు. తెలంగాణలో 15 శాసనసభా స్థానాలను గెలుచుకున్న తమకు ఈ రాష్ట్రంలో బలం పెంచుకోవడానికి వీలవుతుందనే భావనతోనే కాకుండా, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బిజెపి కూటమితో కలిసి 14 శాసనసభా స్థానాలను గెలుచుకన్న నేపథ్యంలో జిహెచ్ఎంసి ఎన్నికల్లో చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలుచుకుంటామనే నమ్మకంతో లోకేష్‌కు ఆయన బాధ్యతలు అప్పగించారని చెబుతున్నారు.
అయితే, దృశ్యం తిరగబడడంతో టిడిపి గ్రేటర్ హైదరాబాదులోని 150 డివిజన్లలో ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. టిడిపి కన్నా తక్కువ స్థానాలకు పోటీ చేసిన బిజెపి నాలుగు స్థానాలు గెలుచుకుంది. దీంతో నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావాన్ని తగ్గించేందుకు తెలంగాణ వ్యవహారాల నుంచి నారా లోకేష్‌ను చంద్రబాబు ముందు చూపుతో తప్పించారని అంటున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!