హైదరాబాద్‌లో హై అలర్ట్...జాగ్రత్తగా ఉండండి..!
దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడు సంఘటన దేశ భద్రతకు పెను సవాల్‌గా మారింది. ఈ విషాదకర ఘటన దేశంలోని పౌరులందరినీ తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. దీని తీవ్రత దృష్ట్యా, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, దేశంలోని అన్ని ప్రధాన నగరాలను అత్యంత అప్రమత్తత స్థితికి చేర్చింది.
ఢిల్లీలో జరిగిన దాడి నేపథ్యంలో, ఆర్థిక రాజధాని ముంబై , ఐటీ హబ్ అయిన హైదరాబాద్ సహా ఇతర ముఖ్యమైన నగరాలన్నింటిలోనూ భద్రతను కట్టుదిట్టం చేశారు. విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, రద్దీగా ఉండే మార్కెట్లు, మాల్స్, పర్యాటక ప్రాంతాల వద్ద నిఘా ,తనిఖీలను అమాంతం పెంచారు.

హైదరాబాద్ ,ముంబైలలోని కీలక కూడళ్లు , వ్యూహాత్మక ప్రదేశాల వద్ద అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. భద్రతా బలగాలు గట్టి నిఘా ఉంచాయి.అనుమానాస్పద కదలికలు లేదా వస్తువుల కోసం ఎప్పటికప్పుడు గాలింపు చర్యలు చేపట్టాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీలో దాడి జరిగిన కొద్ది గంటల ముందు ఉగ్ర కుట్రను భగ్నం చేయడం,ఆ తర్వాత పేలుడు సంభవించడం చూస్తే, ఈ ఘటన వెనుక పెద్ద కుట్రే ఉండే అవకాశం ఉందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. అందుకే, మిగతా నగరాల్లో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ముందస్తుగా భద్రతా చర్యలు చేపట్టారు.
ప్రస్తుతం NIA, NSG బృందాలు దర్యాప్తులో నిమగ్నమై ఉండగా, దాడికి కారణమైన వారిపై త్వరలో కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్రం భరోసా ఇచ్చింది. భద్రతా బలగాలు ,స్థానిక పోలీసులు నిరంతరం సమన్వయం చేసుకుంటూ, ప్రజల భద్రతకు పూర్తి హామీ ఇస్తున్నారు.












Click it and Unblock the Notifications