విద్యుత్ షాక్‌తో నవోదయ విద్యార్థులకు గాయాలు, ఒకరు మృతి: ప్రిన్సిపల్ పరారీ
ఖమ్మం: జిల్లాలోని కూసుమంచి మండలం పాలేరులో విషాద ఘటన చోటు చేసుకుంది. పాలేరులోని నవోదయ పాఠశాలలో విద్యుత్ షాక్‌తో ఓ విద్యార్థి మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. దీంతో విద్యార్థి బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కూసుమంచి మండలంలోని కోక్యా తండాకు చెందిన విద్యార్థి దుర్గా నాగేందర్(16) నవోదయ పాఠశాలలో 12వ తరగతి చదువుతున్నాడు. ఆగస్టు 3న పాఠశాలలో రీజినల్ స్పోర్ట్స్ మీట్ ఉంది. ఇందుకోసం స్పోర్ట్స్ మీట్‌కు వచ్చే వారిని ఆహ్వానించేందుకు గానూ పాఠశాలలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు.

ఈ క్రమంలో ఫ్లెక్సీ కోసం ఇనుప బోర్డు ఏర్పాటు చేస్తుండగా.. బోర్డు పైభాగంలో విద్యుత్ తీగలు తగిలాయి. విద్యుత్ షాక్ తగలడంతో నలుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ముగ్గురు స్వల్పగాయాలతో కోలుకోగా.. దుర్గానాగేందర్ ప్రాణాలు కోల్పోయాడు. ఘటన జరిగిన వెంటనే పాఠశాల ప్రిన్సిపల్ పరారయ్యాడు. విద్యార్థి మృతి చెందిన సమాచారంతో అతని కుటుంబసభ్యులు, బంధువులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.
ప్రిన్సిపల్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని విద్యార్థి సంఘాల నేతలు, గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. వందల సంఖ్యలో స్థానికులు పాఠశాల వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. అక్కడ్నుంచి వారిని చెదరగొట్టారు. పలువురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఘటనా స్థలం చేరుకున్న ఆర్డీవో.. స్కూల్ ప్రిన్సిపల్‌పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులు ఆందోళనను విరమించారు. అయితే, చనిపోయిన విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థి మృతితో అతని కుటుంబంతోపాటు స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.












Click it and Unblock the Notifications