2012లో అదృశ్యం: నయీం ముఠాలో కీలకం, మాజీ నక్సలైట్ ఎక్కడ?
కరీంనగర్:ఎదురు కాల్పుల్లో హతమైన గ్యాంగస్టర్ నయీం ముఠాలో అత్యంత కీలకసభ్యుడు, మాజీ నక్సలైటు జడల నాగరాజు ఏమయ్యాడనేది అంతుబట్టడం లేదు. అతను 2012 డిసెంబర్ నుంచి కనిపించ కుండా పోయాడు. వ్యాపారాల నిమిత్తం విదేశాలకు వెళ్లాడనే ప్రచారం ఓ వైపు ఉండగా, తనను సవాల్ చేసే స్థాయికి ఎదుగుతున్నాడని భయపడి నయీమే అతడి మట్టుపెట్టాడని మరోవైపు ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో నయీం డైరీ ద్వారా సిట్ దర్యాపులో నాగరాజు విషయం తేలే అవకాశం ఉందని అంటున్నారు. కరీంగనర్ జిల్లా ముత్తారం మండలం రామకృష్ణాపూర్‌కు చెందిన జడల నాగరాజు అప్పటి పీపుల్స్‌వార్ (ఇప్పటి మావోయిస్టు) లో దళసభ్యుడిగా చేరాడు.
ఆ తర్వాత కోవర్టు ఆపరేషన్‌లో భాగంగా కమాన్‌పూర్ మండలం బేగంపేట సమీపంలోని రామగిరిఖిల్లా వద్ద దళ కమాండర్ విజయ్‌ను కాల్చిచంపి పెద్దపల్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆ తర్వాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాడు. మాజీ మంత్రి, కాంగ్రెసు నేత శ్రీధర్‌బాబుకు అతి సన్నిహితుడిగా మారాడు. కరీంనగర్‌లో ఓ ఇంట్లో అద్దెకు ఉండే నాగరాజు తన వ్యాపారంలో ఎవరినీ అంతగా నమ్మేవాడు కాదని అంటారు. ఎటువెళ్లినా తన అనుచరవర్గంతోనే అత్యంత రహస్య జీవితం గడిపేవాడని చెబుతారు.

హైదరాబాద్, కరీంనగర్‌లలో మకాం వేసిన నాగరాజు చాలా కాలం పీపుల్స్‌వార్‌కు వ్యతిరేకంగా పనిచేస్తూ అజ్ఞాత దళాలు, నాయకుల కదలికలకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించేవాడని అంటారు. అదే సమయంలో సీనియర్ పోలీసు అధికారులకు సన్నిహితుడై రియ ల్ ఎస్టేట్ వ్యాపారం, సెటిల్‌మెం ట్‌లు, ఇతర కార్య కలాపాలు ప్రారంభించాడు. గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా పనిచేసి కరీం నగర్ జిల్లా జెడిపిటిసిగా పోటీచేయాలని ప్రయత్నించాడు.
ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో తన భార్యను ముత్తారం జెడ్‌పిటిసిగా బరిలోకి దింపి తాను మాత్రం కరీంనగర్ జిల్లాలో స్వగ్రామమైన రామకృష్ణాపురం ఎంపిటిసిగా పోటీచేశాడు. జన జీవన స్రవంతిలో కలసి ఎన్నికల్లో పోటీ చేసి నప్పటికీ నాగరాజు మాత్రం ప్రతీక్షణం అప్రమత్తత తోనే ఉండేవాడు. ఎప్పుడు ఎక్కడికి వెళ్తాడో, ఎప్పుడు తిరిగివస్తాడో కేవలం భార్యకు మాత్రమే అదీ స్వయంగా కలసిమాత్రమే తెలియజేసేవాడు.హైదరాబాద్‌తో పాటు కర్నాటకలోనూ రియల్ ఎస్టేట్ కార్య కలాపాలు ప్రారంభించిన నాగరాజు 2102 డిసెంబర్ 27వ తేదీ ఇంటినుంచి బైటకు వెళ్లాడు.
భార్యకు చెప్పి వెళ్లాడు...
గతంలో మాదిరిగానే తాను పది,పదిహేను రోజులు కాంటాక్ట్‌లోకి రానని, కంగారు పడవ ద్దంటూ భార్యకు చెప్పి వెళ్లాడు. సాధారణంగా వారం, పది రోజు లకో మారు నాగరాజు తాను వినియోగిస్తున్న సెల్‌ఫోన్‌ను, దాని సిమ్‌ను మార్చేస్తాడు. అయితే, అతడు విని యోగించే కారు కరీంనగర్‌లో మెకానిక్ షెడ్‌లో అప్పట్లో తేలింది. దాంతో మరింత కంగారు పడిన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో నాగరాజు సన్నిహితంగా ఉండే ఒకరిద్దరు పోలీసు అధికారుల వద్దకు వచ్చి మొరపెట్టుకున్నారు కూడా.
2012 డిసెంబర్ 24వ తేదీ కడపజిల్లాకు చెందిన ఒక ప్రముఖుడితో నాగరాజు మాట్లాడినట్లు పోలీసు దర్యాప్తులో తేలిందని వార్తలు వచ్చాయి. ఆ ప్రముఖుడిని ఆ విషయంలో విచారిస్తే రెండు మూడు రోజుల్లో బెంగుళూరు వస్తున్నట్లుగా తనకు చెప్పాడని, అక్కడకు రాగానే తానే ఫోన్ చేస్తానన్నాడని, కానీ ఇప్పటి వరకూ అలాంటి ఫోన్ రాలేదని సమాచారం వచ్చింది. అదేవిధంగా డిసెంబర్ 27వ తేదీ చివరిగా హైదరాబాద్ల్ ఉంటున్న కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతానికి చెందిన మరో ప్రముఖుడితో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు తేలింది. ఈరెండు ఫోన్‌ల తరవాత నాగరాజు నుంచి ఎవరికీ ఫోన్‌లు వెళ్లలేదు.
రమేష్ ఇంట్లో నయీం విందు...
కరీంనగర్‌లోని నగునూరు సమీపంలో రియల్ ఎస్టేట్ భూముల్లో నయీం పేరుతో హల్‌చల్ సృష్టించి తుపాకీ ఎక్కుపెట్టిన ఘటనలో మంథని మండలం స్వర్ణపల్లి గ్రామానికి చెందిన కోరవేన రమేశ్ అలియాస్ స్వర్ణపల్లి రమేశ్ ఉన్నట్లు ధ్రువీకరించి అతడిని సిట్ బృందం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే కేసులో నిందితుడిగా భావిస్తూ మంథని మండలం బిట్టుపల్లి గ్రామానికి చెందిన మరోవ్యక్తి కోసం పోలీసులు వేట మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
ఏడాది క్రితం స్వర్ణపల్లిలో రమేశ్ ఇంట్లో జరిగిన ఒక విందుకు నయీం సైతం హాజరైనట్టు సమాచారం. మరికొందరు కూడా నయీం ముఠాతో చేతులు కలిపి అనేక చీకటి దందాల్లో పాల్గొన్నట్టు తెలుస్తోంది. కరీంనగర్, కోరుట్ల ప్రాంతాల్లో నయీం ముఠా దోపిడీలకు పాల్పడిన విషయం సిట్ దర్యాప్తులో తేలిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications